- జూలియస్ బేర్ సంస్థ పేరిట రిటైర్డ్ ఉద్యోగికి టోకరా
- పెట్టుబడులు, ట్యాక్స్‌ల పేరుతో విడతల వారీగా దోపిడీ
- బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన టీజీసీఎస్‌బీ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: అధిక లాభాలు వస్తాయంటూ ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి భారీ మొత్తంలో టోకరా వేశారు. ప్రముఖ స్విస్ ఆర్థిక సంస్థ 'జూలియస్ బేర్ గ్రూప్' పేరిట రూ.4.27 కోట్లకు పైగా కాజేశారు. ఈ ఘటనపై శనివారం కేసు నమోదు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
వాట్సాప్ గ్రూపులో చేర్చి నమ్మించారు
హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన ప్రసాదరావు (65) రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఇతడికి ఆగస్టు 5న సోనల్ జగన్నాథ్ నాయక్ అనే మహిళ పేరిట వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను ముంబయికి చెందిన జూలియస్ బేర్ గ్రూప్ లిమిటెడ్ పెట్టుబడి సలహాదారునంటూ పరిచయం చేసుకుంది. అనంతరం ‘సి 75, జూలియస్ బేర్ ఇన్వెస్టర్ ఎలైట్’ అనే వాట్సాప్ గ్రూపులో చేర్చింది. అందులో కునాల్ సుమయ అనే వ్యక్తి తాను సంస్థ అధిపతినంటూ పరిచయం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని ప్రసాదరావును పూర్తిగా నమ్మించారు.
విడతల వారీగా దోపిడీ.. విత్‌డ్రాకు షరతులు
ఆగస్టు 15న ప్రసాదరావు తొలిసారి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత మరింత ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపడంతో ఎస్‌బీఐ, కరూర్ వైశ్యా బ్యాంకు ఖాతాలతో పాటు మరో ఐదు ఖాతాల ద్వారా నవంబర్ 3వ తేదీ వరకు విడతల వారీగా మొత్తం రూ.4,27,86,401 ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం తన అసలు, లాభాలను విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. బ్యాంకింగ్, సర్వర్ సమస్యలంటూ నేరగాళ్లు కాలయాపన చేశారు. మరింత పెట్టుబడి పెట్టాలని, వివిధ ట్యాక్స్‌లు చెల్లిస్తేనే నగదు వస్తుందని మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు మోసపోయానని గ్రహించాడు. ఈ నెల 26న నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో, 27న టీజీసీఎస్‌బీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
