తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలిగిన జ్యోతి

తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలిగిన జ్యోతి
  •     కొండ కింద సీఆర్పీఎఫ్​ బలగాల బందోబస్తు 

 

మధురై: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండ మీద ఎట్టకేలకు కార్తీక దీపం వెలిగింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో, సీఆర్పీఎఫ్ బలగాల భారీ బందోబస్తు మధ్య సుప్రీంకోర్టు నియమించిన జడ్జీల సమక్షంలో పూజారులు దీపతూన్ (రాతిస్తంభం)పై దీపాన్ని వెలిగించారు. మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. పార్థిబన్–సమక్షంలో ఉచ్చిపిళ్లయార్ మండపం నుంచి తెచ్చిన జ్యోతితో దీపత్తూన్ వద్ద దీపం వెలిగించారు. కొండపై ఉన్న దర్గాకు కనీసం 50 మీటర్ల దూరం పాటిస్తూ, కోర్టు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

సుప్రీం ఆగ్రహం.. ధిక్కరణ నోటీసులు

అంతకుముందు రోజు (శుక్రవారం) కోర్టు ఉత్తర్వుల అమలులో జాప్యంపై విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 20న ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయికుమార్, డీజీపీ మహేష్ అగర్వాల్ సహా 15 మంది అధికారులకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి ధర్మాసనం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ‘రాజ్యాంగ అరాచకానికి’ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, డిసెంబర్ 15న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

రాజకీయ వర్గాల్లో చర్చ

కోర్టు జోక్యం, ఆలయ భద్రత కేంద్ర బలగాల చేతికి వెళ్లడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించగా, సుప్రీం ఆదేశాల నేపథ్యంలో సీఎం విజయ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు 2027 జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. 

ట్రస్ట్ బోర్డు సస్పెన్షన్.. సీఆర్పీఎఫ్‌‌‌‌  భద్రత

ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు, ఆలయ నిర్వహణ బాధ్యతలను రిసీవర్లకు, కొండ మరియు దర్గా పరిసరాల భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించింది. శనివారం కొండపై దర్గాకు కేరళ సహా వివిధ ప్రాంతాల నుంచి ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు, దీపం వెలిగించేందుకు భద్రత కల్పించిన సీఆర్పీఎఫ్ సిబ్బందిపై హిందూ భక్తులు పూలవర్షం కురిపించి హర్షం వ్యక్తం చేశారు.