రూ.1,159 కోట్లతో సమ్మర్ పవర్ ప్లాన్! వేసవి డిమాండ్ను తట్టుకునేందుకు కసరత్తు

రూ.1,159 కోట్లతో సమ్మర్ పవర్ ప్లాన్! వేసవి డిమాండ్ను తట్టుకునేందుకు కసరత్తు
  • రాష్ట్రవ్యాప్తంగా 21,886 మౌలిక సదుపాయాల పనులకు గ్రీన్ సిగ్నల్ 
  • ఐటీ కారిడార్‌‌తోపాటు 
  • గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్​, వెలుగు: వచ్చే వేసవిలో రికార్డు స్థాయిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (సదరన్ డిస్కమ్) భారీ యాక్షన్ ప్లాన్‌‌కు శ్రీకారం చుట్టింది. విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా సంస్థ పరిధిలో రూ.1,159 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 21,886 పనులకు ఆమోదం తెలిపింది. ఈ పనుల ద్వారా కొత్త సబ్‌‌స్టేషన్లు, అదనపు ట్రాన్స్‌‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ లైన్లను బలోపేతం చేయనున్నారు. వేసవి నాటికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టనున్నారు.

ఐటీ కారిడార్‌‌పై ప్రత్యేక ఫోకస్..

వేసవిలో ఏసీల వాడకం, కమర్షియల్, ఐటీ సంస్థల విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే సైబర్‌‌సిటీ సర్కిల్‌‌కు సంస్థ పెద్దపీట వేసింది. ఇక్కడ 1,458 పనులకు అత్యధికంగా రూ.144.24 కోట్లు మంజూరు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన సరూర్‌‌నగర్‌‌కు రూ.88.93 కోట్లు, హబ్సిగూడకు రూ.73.13 కోట్లు, మేడ్చల్‌‌కు రూ.56.17 కోట్లు, రాజేంద్రనగర్‌‌కు రూ.55.47 కోట్లు కేటాయించారు. ఆయా సర్కిళ్లలో ఓవర్‌‌లోడ్ సమస్యలు రాకుండా నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలు బలంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్లలో మూడు చోట్ల కలిపి రూ.51.59 కోట్లతో అవసరానికి తగినట్లుగా పరిమిత స్థాయిలో పనులు చేపట్టనున్నారు.

వ్యవసాయానికి 'పవర్' బూస్ట్..

యాసంగి సాగు, వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ సర్కిళ్లలో డిస్కమ్ పనుల సంఖ్యను పెంచింది. మంజూరైన పనుల సంఖ్య పరంగా నల్గొండ సర్కిల్‌‌లో అత్యధికంగా 2,454 పనులకు రూ.93.81 కోట్లు ఆమోదం లభించింది. ఆ తర్వాత సూర్యాపేటలో 1,810 పనులకు రూ.75.96 కోట్లు, మహబూబ్‌‌నగర్‌‌లో 1,716 పనులకు రూ.79.35 కోట్లు, సిద్దిపేటలో 1,593 పనులకు రూ.53.05 కోట్లు, నాగర్‌‌కర్నూల్‌‌లో 1,302 పనులకు రూ.76.51 కోట్లు కేటాయించారు. ఆయా సర్కిళ్లలో వ్యవసాయ, గృహ అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయనున్నారు.

స్మార్ట్ పర్యవేక్షణ..

హైదరాబాద్ నగర శివార్లలో భవిష్యత్ అవసరాల కోసం మాస్టర్ ప్లాన్ ఆర్ఆర్ పరిధిలో కేవలం 10 పనులే అయినప్పటికీ, రూ.23.16 కోట్లతో భారీ సాంకేతిక పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే వేసవిలో విద్యుత్ సరఫరా అంతరాయాలను తక్షణమే గుర్తించి సరిదిద్దేందుకు స్కాడా వ్యవస్థ బలోపేతానికి రూ.10.08 కోట్లతో 32 పనులు చేపట్టనున్నారు. వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారం నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ప్రధాన పనుల వివరాలు ఇలా..

విద్యుత్ లోడ్‌‌ను తట్టుకునేందుకు 137 పవర్ ట్రాన్స్‌‌ఫార్మర్ల సామర్థ్యం పెంపుదలకు అత్యధికంగా రూ.231.11 కోట్లు కేటాయించారు. అలాగే 12 అదనపు పీటీఆర్‌‌ల ఏర్పాటుకు రూ.11.44 కోట్లు, 637 సబ్‌‌స్టేషన్ల పునరుద్ధరణకు రూ.19.63 కోట్లు మంజూరు చేశారు. లో-వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి 3,380 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌ఫార్మర్ల ఏర్పాటుకు రూ.167.19 కోట్లు, 1,064 డీటీఆర్‌‌ల సామర్థ్యం పెంపుదలకు రూ.81.60 కోట్లు కేటాయించారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు విద్యుత్ లైన్ల ఇంటర్‌‌లింకింగ్ పనులకు రూ.92.47 కోట్లు కేటాయించారు. భద్రత దృష్ట్యా 1,041 చోట్ల సాధారణ ఓవర్‌‌హెడ్ లైన్లను ఏబీ కేబుల్స్‌‌గా మార్చేందుకు రూ.41.53 కోట్లు వెచ్చిస్తున్నారు.