డీలిమిటేషన్ వేళ తెరపైకి ‘గెర్రీమాండరింగ్‌’.. అసలేంటీ పదం?

డీలిమిటేషన్ వేళ తెరపైకి ‘గెర్రీమాండరింగ్‌’.. అసలేంటీ పదం?

న్యూఢిల్లీ: దేశంలో డీలిమిటేషన్‌ చర్చ వేడెక్కుతున్న వేళ ‘గెర్రీమాండరింగ్‌’ అనే పదం పొలిటికల్​ సర్కిల్​లో వైరల్​గా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాల సరిహద్దులను ఉద్దేశపూర్వకంగా మార్చడాన్ని గెర్రీమాండరింగ్‌ అంటారు. ఈ పదం పుట్టింది 1812లో అమెరికాలో. అప్పట్లో మసాచుసెట్స్‌ గవర్నర్‌ ఎల్బ్రిడ్జ్‌ గెర్రీ తన పార్టీకి ఎన్నికల్లో ప్రయోజనం కలిగేలా రాష్ట్రంలోని నియోజకవర్గాల సరిహద్దులను మార్చే బిల్లుకు ఆమోదం తెలిపారు.

అందులో ఒక నియోజకవర్గం విచిత్రమైన ఆకారంలో ఉండి సాలమాండర్‌ అనే జీవిని పోలిందని విమర్శకులు ఎద్దేవా చేశారు. గవర్నర్‌ ‘గెర్రీ’ పేరును, ‘సాలమాండర్‌’ పదాన్ని కలిపి ‘గెర్రీమాండర్‌’ అనే పదాన్ని సృష్టించారు. ఆ నియోజకవర్గం ఆకారాన్ని కార్టూన్‌గా చిత్రీకరించి 1812 మార్చి 26న బోస్టన్‌ గెజిట్‌లో ప్రచురించడంతో ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి నుంచి రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను మార్చే వ్యూహాలకు ఈ పదం వాడుకలోకి వచ్చింది.