- ప్రతి టవర్ వద్ద ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలివిడతగా లక్ష ఇళ్ల లక్ష్యంతో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం మల్కాజిగిరి నియోజకవర్గం కౌకూర్‌లో స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ టవర్స్‌కు మంత్రి భూమిపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. టవర్ల నాణ్యత, కాలపరిమితి పర్యవేక్షణ బాధ్యతలను 'రేరా'కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు నెలకోసారి తమ ఫ్లాట్లను పరిశీలించి, నాణ్యత లోపాలుంటే ప్రతి టవర్ వద్ద ఏర్పాటు చేసే బాక్సులో ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఓట్ల కోసం కాదు.. పేదల సంక్షేమం కోసమే
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూ.40 వేల కోట్లతో 8 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, ఇప్పటికే 2.25 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి గుర్తుచేశారు. ఇది ఓట్ల కోసం చేస్తున్న పని కాదని, పేదల సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు. ఇళ్లు రానివారు నిరాశపడొద్దని, మూడు, నాలుగు విడతల్లో లాటరీ పద్ధతి ద్వారా చివరి లబ్ధిదారుడి వరకు తల తాకట్టు పెట్టయినా ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ స్వగృహ, వాంబే కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులకు డ్రా తీసి కేటాయింపు పత్రాలు అందించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఎండీ వి.పి.గౌతమ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
