భోపాల్: భారత మహిళల హాకీ టీం మరోసారి అదరగొట్టింది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని వరుసగా మూడోసారి గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో చైనాపై 3-–1తో విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. మ్యాచ్ ఆరంభంలో చైనా దూకుడు చూపించింది. టీమిండియాపై ఒత్తిడి పెంచుతూ అటాక్చేసింది. రెండో క్వార్టర్లో చెన్ యుజున్ గోల్ చేయడంతో చైనా 1-0 లీడ్ లోకి వెళ్లింది. ఆ సమయంలో భారత ఆటగాళ్లు పాస్‌లు ఇవ్వడంలోనూ, బంతిని నియంత్రించడంలోనూ ఇబ్బంది పడ్డారు.
దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ వెనుకబడింది. కానీ సెకండ్ హాఫ్‌లో అద్భుతంగా పుంజుకుంది. దీపిక పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసి స్కోరును 1--–1తో సమం చేసింది. ఆ తర్వాత ఇషికా గోల్‌తో భారత్ 2-–-1 ఆధిక్యంలోకి వెళ్లింది. కొద్దిసేపటికే దీపిక మరో గోల్ చేయడంతో లీడ్ 3--–1కు చేరింది. రెండు గోల్స్ చేసిన దీపిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
ఈ గెలుపుతో భారత్ వరుసగా మూడోసారి, మొత్తంగా నాలుగోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. కాగా ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. ఈ ఏడాది ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లోనూ చైనాను ఓడించి భారత్ 2028 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించిందని అధికారులు తెలిపారు. ఇక ఈనెల 25న విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నాలుగో స్థానానికి చేరుకుంది.
