- జాతీయ స్థాయి సర్వేలో టాప్ ర్యాంకే టార్గెట్ 2, 5, 8వ తరగతి స్టూడెంట్ల కోసం యాక్షన్ ప్లాన్
- రెండేండ్లలో 5 మాక్ టెస్టులు..
- ప్రైవేట్ స్కూళ్లకూ వర్తింపు
- గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర విద్యాశాఖ
హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయి ‘పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ (పీఆర్ఎస్–ఆలోచించి పరీక్షలు రాసే విధానం) 2027’లో తెలంగాణ రాష్ట్రం మెరుగైన ర్యాంకు సాధించేలా పాఠశాల విద్యాశాఖ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు రెండేండ్ల ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో 2, 5, 8వ తరగతుల విద్యార్థులకు ఇకపై ప్రతిరోజూ ఒక స్పెషల్ పీరియడ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వీరిపై దృష్టి సారించి, వచ్చే ఏడాది (2027–28) వీరు 3, 6, 9 తరగతులకు వెళ్లినప్పుడు నిర్వహించే
జాతీయ సర్వేకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయనున్నారు.దీని కోసం అధికారులు ప్రత్యేకంగా మార్గదర్శకాలనూ రిలీజ్ చేశారు.
ఐటెమ్ బ్యాంకులతో ప్రాక్టీస్
విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంచేందుకు ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన కాంపిటెన్సీ బేస్డ్ ఐటెమ్ బ్యాంకులను scert.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. స్కూల్ గ్రాంట్ నిధులతో వీటి ప్రింటవుట్లు తీసి టీచర్లకు అందించాలని హెచ్ఎంలకు సూచించారు. స్పెషల్ పీరియడ్‌లో రోజుకో సబ్జెక్టు చొప్పున ఈ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయిస్తూ రెండేళ్లలో మొత్తం ఐదు మాక్ టెస్టులు (ఈ ఏడాది రెండు, వచ్చే ఏడాది మూడు) నిర్వహిస్తారు. ప్రతి పరీక్ష తర్వాత మార్కులను విశ్లేషించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక రెమిడియల్ టీచింగ్ అందిస్తారు.
పరీక్షల ప్యాటర్న్ మార్పు
రెగ్యులర్ తరగతుల్లో బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికి, పాఠ్యాంశాలను నిజజీవిత ఘటనలతో అనుసంధానం చేస్తూ లాజికల్ రీజనింగ్ పెంచేలా బోధించాలని టీచర్లకు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇకపై స్కూళ్లలో నిర్వహించే స్లిప్ టెస్టులు, ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల ప్రశ్నాపత్రాలను పూర్తిగా పీఆర్ఎస్(పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ ) ప్యాటర్న్‌లోనే తయారు చేయాలి. మూస ప్రశ్నల స్థానంలో గ్రాఫ్‌లు, పట్టికలు, బొమ్మలు, డయాగ్రామ్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, అప్లికేషన్ ఓరియెంటెడ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను చేర్చాలని ఆదేశించింది.
వినూత్న యాక్టివిటీస్
విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి ‘పీఆర్ఎస్ క్వశ్చన్ ఆఫ్ ది డే’, ‘థింక్ అండ్ ఆన్సర్’, ‘పీర్ లెర్నింగ్’, ‘ఎర్రర్ అనాలిసిస్’ వంటి వినూత్న యాక్టివిటీస్ చేపట్టాలని అధికారులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ.నవీన్ నికోలస్ సూచించారు. ప్రతి పాఠశాలలో ‘పీఆర్ఎస్ ప్రిపరేషన్ యాక్టివిటీ రిజిస్టర్’తో పాటు విద్యార్థుల వారీగా లెర్నింగ్ గ్యాప్ రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని, టీచర్ల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఈ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు.
