ఫాలోఆన్ తప్పించుకున్న భారత్.. 246 పరుగులకే ఆలౌట్.. 110 రన్స్ ఆధిక్యంలో న్యూజిలాండ్

ఫాలోఆన్ తప్పించుకున్న భారత్.. 246 పరుగులకే ఆలౌట్.. 110 రన్స్ ఆధిక్యంలో న్యూజిలాండ్

IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజున టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్‌కు 110 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అంతకుముందు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (88) ఆపద్బాంధవుడిలా నిలిచి భారత జట్టుకు ఫాలోఆన్ గండం తప్పించాడు.

ఆరంభంలోనే షాక్.. ఆదుకున్న జురెల్, ఆకాశ్: 

మూడో రోజు ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే అన్షుల్ కాంబోజ్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ తన ఖాతాలో రెండో వికెట్ వేసుకున్నాడు. అయితే క్రీజులోకి వచ్చిన పేసర్ ఆకాశ్ దీప్ వేగంగా ఆడుతూ 29 పరుగులు సాధించాడు. జురెల్‌తో కలిసి 46 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఆకాశ్‌ను మార్నింగ్ సెషన్‌లో నాథన్ స్మిత్ అవుట్ చేశాడు.

జురెల్ పోరాటం.. జెమీసన్ 4 వికెట్లు: 

ఒకవైపు వికెట్లు పడుతున్నా ధ్రువ్ జురెల్ మాత్రం పట్టుదలగా క్రీజులో నిలబడి 88 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి పోరాటంతోనే భారత్ ఫాలోఆన్ గండం నుంచి బయటపడగలిగింది. కివీస్ బౌలర్లలో కైల్ జెమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, జాకబ్ డఫీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.