హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని వెన్నెలగడ్డ చెరువును ఆక్రమణల నుంచి హైడ్రా కాపాడింది. సుమారు 38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో కొందరు మట్టిపోసి గదులు, షెడ్లు నిర్మిస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి నాలుగు ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు.
చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ప్రీకాస్ట్ గోడలతో పాటు అక్కడక్కడ ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించారు. మళ్లీ ఆక్రమణలు జరగకుండా కిలోమీటరుకు పైగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెరువు హద్దులను నిర్ధారిస్తూ హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు.
