హైదరాబాద్ సిటీ, వెలుగు: మోకిలా లేఅవుట్‌లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ నిర్వహించనున్న ఐదో విడత ఈ -వేలానికి కొనుగోలుదారుల నుంచి స్పందన లభిస్తోంది. శనివారం మోకిలా లేఅవుట్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించింది. సర్వే నంబర్ 96/పీలోని ప్లాట్ల వేలానికి సంబంధించి పలువురు కొనుగోలుదారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేఅవుట్ వివరాలు, రవాణా సదుపాయాలు, పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఈ-వేలం ప్రక్రియపై అధికారులు వివరించారు.
కేపీఎంజీ ట్రాన్సాక్షన్ అడ్వైజర్స్ ప్రతినిధులు ప్రాంతం ప్రత్యేకతలు, కనెక్టివిటీ, అభివృద్ధి అవకాశాలను వివరించగా.. ఎంఎస్‌టీసీ అధికారులు ఈ-వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ విధానం, నిబంధనలను తెలియజేశారు. ఈ-వేలం డిసెంబర్ 15న రెండు విడతల్లో జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకుక, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
