రైతు బతికితేనే పౌల్ట్రీ పరిశ్రమకి మనుగడ

రైతు బతికితేనే పౌల్ట్రీ పరిశ్రమకి మనుగడ

భారతదేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో పౌల్ట్రీ రంగం ఒకటి. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ప్రోటీన్ అందించడంతోపాటు, లక్షలాది మంది రైతులకు, కార్మికులకు, రవాణా వ్యాపారులకు, ఫీడ్ తయారీదారులకు ఉపాధి కల్పిస్తున్న కీలక రంగం ఇది.  తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ పరిశ్రమలో దేశంలోనే ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. 

గుడ్ల ఉత్పత్తి,  బ్రాయిలర్ కోళ్ల పెంపకం, హేచరీలు, ఫీడ్ తయారీ, ప్రాసెసింగ్ వంటి అనేక విభాగాల్లో రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించింది.  అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన పరిశ్రమ నేడు అనేక ఆర్థిక, సాంకేతిక, మార్కెట్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ రైతుల ఆదాయంలో స్థిరత్వం కనిపించడం లేదు. పెట్టుబడులు పెరుగుతున్నాయి. లాభాలు మాత్రం అనిశ్చితంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ పౌల్ట్రీ రంగానికి ఒక సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అవసరం.

2019 నాటి 20వ పశుగణన  ప్రకారం తెలం

గాణలో  మొత్తం పౌల్ట్రీ సంఖ్య సుమారు 799.99 లక్షలు. ఇందులో 624.55 లక్షలు వాణిజ్య పౌల్ట్రీకాగా, 175.44 లక్షలు బ్యాక్‌‌‌‌యార్డ్ పౌల్ట్రీ. దేశంలోని వాణిజ్య పౌల్ట్రీలో తెలంగాణ వాటా సుమారు 11.68 శాతం. ఇది రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ విస్తృతిని తెలియజేస్తోంది.  ఇక గుడ్ల ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటి. 

పరిశ్రమ వర్గాలు వెల్లడించిన అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 6,000 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటిలో రంగాలవారీగా సుమారు 2,000 లేయర్ రైతులు, 10,000 బ్రాయిలర్ రైతులు, 150 బ్రీడర్ రైతులు ఉన్నట్లు పరిశ్రమ గణాంకాల్లో పేర్కొన్నారు. ఈ సంఖ్యలు అధికారిక తాజా రైతుల జనగణన కాకుండా పరిశ్రమ వర్గాల అంచనాలు.   పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం రాష్ట్రంలో రోజుకు సుమారు 12 లక్షల బ్రాయిలర్ పక్షులు మార్కెట్‌‌‌‌కు వస్తున్నాయి. 

ప్రధాన సమస్య దాణా ధరల పెరుగుదల

పౌల్ట్రీ  రైతుల ప్రధాన సమస్య దాణా ధరలు.  మొక్కజొన్న, సోయాబీన్ వంటి ముడి పదార్థాల ధరలు పెరిగినప్పుడు కోళ్ల పెంపకం ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. సాధారణంగా బ్రాయిలర్ ఉత్పత్తి వ్యయంలో దాణా వాటా 65 నుంచి 70 శాతం వరకు ఉంటుంది.  మరోవైపు మార్కెట్‌‌‌‌లో చికెన్ ధరలు  తగ్గినప్పుడు రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పెట్టుబడి పెరిగినా గిట్టుబాటు ధర లభించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

ముఖ్యంగా స్వతంత్రంగా ఫారాలు నిర్వహించే చిన్న,  మధ్య తరహా రైతులకు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. మొక్కజొన్న, సోయాబీన్ రైతులు,  పౌల్ట్రీ రైతుల మధ్య ప్రత్యక్ష అనుసంధానం కల్పించాలి. రాష్ట్రంలోనే ఫీడ్ ముడి 
పదార్థాల నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కృత్రిమ కొరత, అక్రమ నిల్వలను అరికట్టాలి. అవసరమైనప్పుడు ప్రభుత్వ సంస్థల ద్వారా సముచిత ధరలకు దాణా పదార్థాలు అందించే విధానం తీసుకురావాలి. 


పౌల్ట్రీ పరిశ్రమలో రైతులను భాగస్వాములుగా చేయాలిఇంటిగ్రేటెడ్ విధానంలో కూడా రైతుల సమస్యలు ఉన్నాయి. పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు, కార్మికుల వేతనాలు, షెడ్ నిర్వహణ, నీటి సమస్యలు, వేసవి ఉష్ణోగ్రతలు, బ్యాంకు రుణాల భారం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి.  కంపెనీలు,  రైతుల మధ్య ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలి.  

రైతులకు చెల్లించే పెంపకం కూలీ, పనితీరు ప్రోత్సాహకాలు, నష్టాల బాధ్యత,  కోళ్ల మరణాల లెక్కింపు వంటి అంశాలకు స్పష్టమైన ప్రమాణాలు ఉండాలి. తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు కూడా పౌల్ట్రీ ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. హీట్ స్ట్రెస్ వల్ల కోళ్ల పెరుగుదల తగ్గడం, మరణాల సంఖ్య పెరగడం, దాణా వినియోగం తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఆధునిక వెంటిలేషన్, కూలింగ్ ప్యాడ్స్, నీటి నిర్వహణకు ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహకారం అందించాలి.

- తాళ్ళపెళ్లి సురేందర్ 
జర్నలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.