నారీ శక్తిని ఏ పార్టీ ఆపలేదు.. 33 శాతం రిజర్వేషన్లకున్న అడ్డంకులన్నీ తొలగిస్తం:  ప్రధాని మోడీ

నారీ శక్తిని ఏ పార్టీ ఆపలేదు.. 33 శాతం రిజర్వేషన్లకున్న అడ్డంకులన్నీ తొలగిస్తం:  ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇందుకు ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగిస్తామని దేశంలోని మహిళలకు హామీ ఇచ్చారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం కోసం దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్నదని మోదీ గుర్తుచేశారు. 

ఈ విషయంపై ఎంతోమంది మహిళలు తనకు ఉత్తరాలు రాశారని, వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారని ఆయన శనివారం 'ఎక్స్' వేదికగా తెలిపారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పార్టీలు నారీ శక్తి ఎదుగుదలను ఎప్పటికీ ఆపలేవని ప్రధాని తేల్చిచెప్పారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం ఖాయమని, అందుకు ఇంకొంతసమయం మాత్రమే పడుతుందని ధీమా వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఉన్న మహిళల మద్దతుందని ఆయన పేర్కొన్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు ఊరట

మహిళలకు 33 శాతం కోటా అమలు కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు-2026, నియోజకవర్గాల పునర్విభజన (రెండవ) బిల్లు-2026లను ప్రభుత్వం సిద్ధం చేసింది. లోక్‌‌‌‌సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్లను 50 శాతం పెంచడం ద్వారా మహిళా రిజర్వేషన్‌‌‌‌ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

 కొత్త ప్రతిపాదన ప్రకారం.. లోక్‌‌‌‌సభ గరిష్ట సీట్ల సంఖ్య 850కి పెరగనుంది. ఇందులో రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు ఉంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం.. ప్రస్తుతం ఏ రాష్ట్ర శాసనసభలోనైనా ఉండాల్సిన గరిష్ట సభ్యుల సంఖ్య 500కి మించకూడదు. 

ఇప్పుడా పరిమితిని 500 నుంచి 650కి పెంచుతున్నారు. జనాభా ఆధారంగా సీట్లు విభజిస్తే తమ ప్రాతినిధ్యం తగ్గుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని అలాగే కొనసాగించాలని బిల్లులో ప్రతిపాదించారు.

ఏప్రిల్‌‌‌‌లో వీగిన బిల్లుకు కొత్త రూపం

2023లో మహిళా రిజర్వేషన్ చట్టం తెచ్చినప్పటికీ దాని అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టారు. ఆ తర్వాత ఏప్రిల్‌‌‌‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌‌‌‌సభలో వీగిపోయింది. ఆ బిల్లుకు 298 ఓట్లు అనుకూలంగా.. 230 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. బిల్లు పాస్ కావడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రాలేదు. 

పునర్విభజన కోసం వేచి చూడకుండానే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని పలు పార్టీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సవరించిన కొత్త బిల్లులను ఈ నెల 30న మొదలయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌‌‌‌సభ నాలుగు రోజుల పాటు జరగనుండగా.. రాజ్యసభ డిసెంబర్ 2న సమావేశం కానుంది.