- రెండేళ్ల పాప, ఎనిమిది నెలల కవలల మృతి
- ప్రాణాలతో బయటపడిన తల్లి... అరెస్ట్ చేసిన పోలీసులు
- దంపతుల మధ్య గొడవే కారణమని అనుమానం
షాద్ నగర్, వెలుగు: అమ్మ ఒడిలో పెరగాల్సిన పసికందులు.. అదే తల్లి చేతిలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నతల్లే తన ముగ్గురు పిల్లలను నీటి సంపులో పడేసి, తానూ దూకిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో కలకలం రేపింది. శనివారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, తల్లి ప్రాణాలతో బయటపడింది. దీంతో కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన కందెన చెన్నయ్య, శ్రీవర్ష దంపతుల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీవర్ష తన ముగ్గురు కూతుళ్లను ఇంట్లో ఉన్న నీటి సంపులో పడేసి, తానూ అందులోకి దూకింది.
ఈ ఘటనలో చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోగా, తల్లి ప్రాణాలతో బయటపడింది. మృతి చెందిన చిన్నారుల్లో రెండేళ్ల ప్రియాంకతో పాటు ఎనిమిది నెలల వయసున్న కవలలు ప్రిన్సి, ప్రీతి ఉన్నారు. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ, తల్లిదండ్రుల ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటం స్థానికులను కలచివేసింది. ఒకేసారి ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్తులు సైతం ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికుల సమాచారంతో కేశంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో బయటపడిన తల్లిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దంపతుల మధ్య జరిగిన గొడవే ఈ ఘటనకు కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
