రాయ్‌పూర్: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్‌గఢ్ జిల్లాలోని రాంచీ-పట్నా హైవేపై ఆదివారం (నవంబర్ 29) తెల్లవారుజూమున కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. బిహార్ నుంచి జార్ఖండ్‌లోని రజ్రప్పాకు వెళ్తున్న స్కోర్పియో వాహనం ప్రమాదానికి గురైందని చెప్పారు.
జాతీయ రహదారి 33పై తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న 14 మంది బిహార్‌లోని నలంద జిల్లా జంఘారో గ్రామానికి చెందినవారు. రజ్రప్పా ఆలయంలో పూజలు చేసేందుకు వీరంతా బయలుదేరారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
రక్షించిన స్థానికులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన వాహనం నుంచి బాధితులను బయటకు తీసి క్షతగాత్రులను తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది.
13 మంది ఆస్పత్రికి తీసుకువచ్చేలోపే చనిపోయారని జిల్లా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
