- మోదీ, అమిత్ షా, ఈసీకి ‘బ్లాంక్ కాన్వాస్’ ఇస్తున్నరు
- ఎన్నికల వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకునే వ్యూహం
- బీజేపీకి భారీ రాజకీయ లబ్ధి కల్పించే ప్రయత్నం
- 2011 జనాభా లెక్కలతో డీలిమిటేషన్ ఎలా?
- 2027 సెన్సస్, తాజా కులగణన ఆధారంగా పునర్విభజన జరగాలి
- లేదంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 40 ఏండ్ల పాటు అన్యాయం
- మహిళా కోటా అమలుకు సీట్ల పెంపు అవసరమే లేదని కామెంట్
న్యూఢిల్లీ: లోక్‌సభ సీట్లను 850కి పెంచే ప్రతిపాదన దేశ ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇది కేవలం సీట్ల పెంపు వ్యవహారం కాదని, దేశ ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ వేస్తున్న రాజకీయ ఎత్తుగడ అని ఆరోపించారు. 850 సీట్ల ప్రతిపాదనకు అంగీకరిస్తే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఎన్నికల మ్యాప్‌ను ఇష్టానుసారంగా మార్చుకునేందుకు ‘బ్లాంక్ కాన్వాస్’ ఇచ్చినట్టేనని విమర్శించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా 2027 జనాభా లెక్కలు, తాజా కులగణన గణాంకాల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు. పాత జనాభా లెక్కలతో సీట్లను 2051 వరకు ఫ్రీజ్(మార్పుకు వీలులేకుండా) చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు రావాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం 40 ఏండ్ల పాటు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ల అమలుకు 850 స్థానాలు అవసరం లేదని, ప్రస్తుతమున్న 543 స్థానాల్లోనే 33 శాతం కోటాను అమలు చేయొచ్చన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఈ ప్రయత్నాన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
డీలిమిటేషన్ వెనుక అసలు ఉద్దేశం అదే
లోక్‌సభ స్థానాలను ఇప్పటికిప్పుడు 850కి పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని రాహుల్ ప్రశ్నించారు. అసోం, కాశ్మీర్లో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ఉద్దేశం అర్థమవుతుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఎన్నికల మ్యాప్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాలు, వర్గాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించడం, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం ఈ వ్యూహంలో భాగమని విమర్శించారు. దీని వల్ల ఎన్నికల్లో ప్రజల తీర్పుతో సంబంధం లేకుండానే అధికార పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. ‘జెన్ జీ’ యువత 850 అనే సంఖ్యను గుర్తుంచుకోవాలని, అది భారత ప్రజాస్వామ్య హత్యకు ప్రతీకగా మారుతుందని వ్యాఖ్యానించారు.
పాత లెక్కలతో సామాజిక న్యాయానికి దెబ్బ
డీలిమిటేషన్‌కు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలన్న కేంద్రం ఆలోచనను రాహుల్ తీవ్రంగా వ్యతిరేకించారు. 2027లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు నిర్వహించనున్న నేపథ్యంలో పాత గణాంకాలతో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం ఎందుకని ప్రశ్నించారు. తాజా జనాభా లెక్కలతోపాటు కులగణన వివరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే దేశంలోని వివిధ సామాజిక వర్గాల జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందన్నారు. 2011 లెక్కల ఆధారంగా సీట్లను పెంచి, రాష్ట్రాల వారీగా వాటాను 2051 వరకు స్థంభింపజేస్తే మారిన జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు రావాల్సిన ప్రాతినిధ్యం దక్కదని చెప్పారు. దాదాపు 40 ఏండ్ల పాటు ఈ వర్గాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కులగణన ఫలితాలు బయటకు రావడం ఇష్టం లేకే కేంద్రం 2027 జనాభా లెక్కలను పక్కనపెడుతున్నదని ఆరోపించారు. సామాజిక న్యాయం దృష్ట్యా తాజా జనాభా, కులగణన గణాంకాల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలని స్పష్టం చేశారు.
కమిషన్‌పై పూర్తి నియంత్రణ కోసమేనా?
డీలిమిటేషన్ ప్రక్రియలో కీలకమైన కమిషన్ ఏర్పాటుపైనా రాహుల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఎంపిక చేసిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని ఆరోపించారు. కమిషన్‌లోని మూడో సభ్యుడిని కూడా జ్ఞానేశ్ కుమారే ఎంపిక చేస్తారని చెప్పారు. అంటే ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే కీలక నిర్ణయాలన్నీ అధికార పార్టీకి అనుకూలమైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జ్ఞానేశ్ కుమార్ తీసుకునే నిర్ణయాలకు చట్టపరమైన రక్షణ ఉండటంతో వాటిని కోర్టులో సవాలు చేయడం కూడా కష్టమని విమర్శించారు. 2024 ఎన్నికల్లో 14 కోట్ల మంది అనర్హులు ఓటు వేశారని, ఎన్నికల వ్యవస్థలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ 100కు పైగా స్థానాలను దొంగిలించిందని విమర్శించారు. దేశ ఎన్నికల వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సింది పోయి, వాటిని కప్పిపుచ్చుకునేందుకు కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నారని మండిపడ్డారు. అదానీ, మోదీ, అమిత్ షా దేశ సంపదను దోచుకోవడం కొనసాగించేలా ఈ ప్రణాళిక ఉందని ఆరోపించారు.
543 సీట్లతోనే మహిళా కోటా అమలు చేయొచ్చు
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభ స్థానాల పెంపుతో ముడిపెట్టడాన్ని రాహుల్ తప్పుబట్టారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు నియోజకవర్గాల సంఖ్యను 850కి పెంచాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలనే కొనసాగిస్తూ, 2027 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలని సూచించారు. మహిళలకు 33 శాతం కోటాను ప్రస్తుత లోక్‌సభ స్థానాల్లోనే అమలు చేయవచ్చని స్పష్టం చేశారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నది నిజమైన ఉద్దేశమైతే దానికి అడ్డంకులు వెతకాల్సిన పనిలేదన్నారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో డీలిమిటేషన్‌కు ఆమోదం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడితే దేశమే మనుగడ సాగించలేదని, ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాలని సూచించారు.
