కష్టాల్లో టీమిండియా.. ఫస్ట్ ఇన్నింగ్స్‎లో 116 పరుగులకే 6 వికెట్లు

 కష్టాల్లో టీమిండియా.. ఫస్ట్ ఇన్నింగ్స్‎లో 116 పరుగులకే 6 వికెట్లు

క్రైస్ట్‌‌‌‌‌‌‌‌చర్చ్: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసేసరికి.. 46 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 116 పరుగులు చేసింది. భారత్ ఇంకా 240 పరుగులు వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్ (7) ఉన్నాడు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ (2/33), జాకబ్ డఫీ (2/21) భారత బ్యాటింగ్ లైనప్‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీశారు. రెండు రోజు న్యూజిలాండ్ అన్ని విభాగాల్లో పట్టు బిగించి పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. 

ఆకాశ్ దీప్ (5/99)

ఓవర్ నైట్ స్కోరు 246/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన కివీస్‎కు అన్షుల్ కాంబోజ్ షాక్ ఇచ్చాడు. మ్యాచ్ షురూ అయ్యిన కాసేపటికే గ్లెన్ ఫిలిప్స్ (36)ను ఔట్ చేశాడు. అయితే, నాథన్ స్మిత్ (26)తో కలిసి టామ్ బ్లండెల్ 44 పరుగులు జోడించాడు. ఆకాశ్ దీప్ స్మిత్, కైల్ జేమీసన్‌‌‌‌‌‌‌‌లను ఔట్ చేసినప్పటికీ, గల్లీలో దేవదత్ పడిక్కల్ రెండు క్యాచ్‌‌‌‌‌‌‌‌లు, లంచ్ తర్వాత గుర్నూర్ బ్రార్ మరో సులువైన క్యాచ్ వదిలేయడంతో మ్యాట్ హెన్రీకి వరుసగా మూడు లైఫ్‎లు దక్కాయి. ఎట్టకేలకు బ్లండెల్ (89)ను గుర్నూర్ బ్రార్ ఔట్ చేయగా, మ్యాట్ హెన్రీని పెవిలియన్ పంపిన ఆకాశ్ దీప్ (5/99) ఫైఫర్ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 26 ఓవర్లు వేసిన జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 356 పరుగులకు ఆలౌటైంది.

భారత్ టాపార్డర్ విఫలం

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌‌‌‌‌‌‌‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే మ్యాట్ హెన్రీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో యశస్వి జైస్వాల్ డకౌట్‌‌‌‌‌‌‌‌గా వెనుదిరిగాడు. దేవదత్ పడిక్కల్ (21) దూకుడుగా ఆడే ప్రయత్నంలో జేమీసన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కీపర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. టీ బ్రేక్​కు ముందు చివరి ఓవర్లో కెప్టెన్ శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్‌‌‌‌‌‌‌‌ను సైతం జేమీసన్ ఔట్ చేయడంతో భారత్ 59/3 వద్ద కష్టాల్లో పడింది. 

టీ విరామం తర్వాత 38 బంతుల్లో 23 పరుగులు చేసిన రిషభ్ పంత్, జాకబ్ డఫీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్సర్ బాదిన వెంటనే క్రీజు వదిలి ముందుకు దూసుకెళ్లి భారీ షాట్‌‌‌‌‌‌‌‌కు ప్రయత్నించాడు. హాగ్లీ ఓవల్ పిచ్‌‌‌‌‌‌‌‌పై లభిస్తున్న అదనపు బౌన్స్‌‌‌‌‌‌‌‌ను అంచనా వేయలేకపోవడంతో బంతి గాల్లోకి లేచి కైల్ జేమీసన్ చేతికి చిక్కింది. గతేడాది గువాహటిలో మార్కో యాన్సెన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ పంత్ ఇలాగే ఔటయ్యాడు. 

ఇక కేఎల్ రాహుల్ (25) కాసేపు పోరాడి ఔటయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (60 బంతుల్లో 10), ధ్రువ్ జురెల్ (45 బంతుల్లో 7 రన్స్) 15 ఓవర్లకు పైగా వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ ఆఖరి బంతికి నాథన్ స్మిత్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సుందర్ స్లిప్‌‌‌‌‌‌‌‌లో క్యాచ్ ఇవ్వడంతో భారత్ 116/6 స్కోరుతో రెండో రోజును ముగించింది. ఇంకా 240 పరుగులు వెనుకబడింది. కివీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో కైలీ జెమీసన్‌‌‌‌‌‌‌‌, జాకబ్‌‌‌‌‌‌‌‌ డఫీ చెరో రెండు వికెట్లు తీయగా.. మ్యాట్‌‌‌‌‌‌‌‌ హెన్రీ, నాథన్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ తలా ఒక వికెట్‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్నారు. 

సంక్షిప్త స్కోర్లు:

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 356 ఆలౌట్ (116.3 ఓవర్లలో - టామ్ బ్లండెల్ 89, టామ్ లాథమ్ 59, గ్లెన్ ఫిలిప్స్ 36; ఆకాశ్ దీప్ 5/99, గుర్నూర్ బ్రార్ 2/78).
భారత్ తొలి ఇన్నింగ్స్: 116/6 (46 ఓవర్లలో - కేఎల్ రాహుల్ 25, రిషభ్ పంత్ 23; 
కైల్ జేమీసన్ 2/33, జాకబ్ డఫీ 2/21).