- 50% పెంపుతో రిజర్వ్డ్ కేటగిరీ సీట్లలో భారీ మార్పులు
- గతంలో కన్నా ఎస్సీలకు 13, ఎస్టీలకు7 దాకా పెరగనున్న సీట్లు
- లోక్‌సభలో ఎస్టీ, ఎస్సీలకు 1 నుంచి 2 సీట్ల దాకా పెరిగే చాన్స్
- 33% రిజర్వేషన్లతో అసెంబ్లీలో 59 నుంచి 60 సీట్లు మహిళలకే
- లోక్‌సభలోనూ 8 నుంచి 9 సీట్లు వాళ్లవే!
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డీలిమిటేషన్ బిల్లు – 2026 అమల్లోకి వస్తే తెలంగాణ చట్టసభల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. లోక్‌సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచేలా బిల్లులోని సెక్షన్ 10లో స్పష్టమైన నిబంధన చేర్చారు. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182 వరకు, 17 లోక్‌సభ స్థానాలు 26 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. 2023 నాటి 106వ రాజ్యాంగ సవరణ (నారీ శక్తి వందన్), ఆర్టికల్ 334ఏ కింద 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలైతే అసెంబ్లీలో 59 నుంచి 60 స్థానాలు, లోక్‌సభలో 8 నుంచి 9 స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. ఎస్సీ, ఎస్టీ మహిళా సబ్-కోటా, రొటేషన్ విధానం, నియోజకవర్గాల పునర్విభజనతో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఎస్సీ, ఎస్టీలకు ఎంత పెరగొచ్చు?
ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. 17 లోక్‌సభ స్థానాల్లో ఎస్సీలకు 3 (పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూలు), ఎస్టీలకు 2( ఆదిలాబాద్, మహబూబాబాద్) స్థానాలు కేటాయించారు.
కానీ 2026 డీలిమిటేషన్ బిల్లులోని సెక్షన్ 10 ప్రకారం చట్టం అమల్లోకి రావడానికి ముందున్న సీట్ల సంఖ్యకు అదనంగా 50 శాతం పెంపు వర్తిస్తుంది. సంఖ్యాపరంగా119 సీట్లపై 50 శాతం పెంచితే 179 (178.5 కి రౌండ్ ఫిగర్) అవుతుండగా, ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో సమానంగా (అంటే సగటున 7 చొప్పున) అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేలా లెక్కిస్తే 182 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశముందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో కొత్తగా 60 నుంచి 63 అసెంబ్లీ స్థానాలు, 9 లోక్‌సభ స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రాలేదు గనుక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సీపెక్ లెక్కలను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ సీట్లపై విశ్లేషకులు, లీడర్లు ఒక అంచనాకు వస్తున్నారు. ఈ సర్వే నివేదిక ప్రకారం రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 17.42% , ఎస్టీలు 10.43% ఉన్నట్లు తేలింది. ఒకవేళ 182 అసెంబ్లీ సీట్ల లెక్కన చూస్తే ఎస్సీలకు 31 నుంచి 32 స్థానాలు, ఎస్టీలకు 19 స్థానాలు ఖాయమవుతాయి. అంటే ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా ఎస్సీలకు 12 నుంచి 13 స్థానాలు, ఎస్టీలకు 7 స్థానాలు పెరగనున్నాయి.
లోక్‌సభ స్థానాలు ఇలా..
50 శాతం పెంపుతో రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు17 నుంచి 26కు చేరనున్నాయి. తాజా జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఎస్సీ లకు 4 నుంచి 5 స్థానాలు( ప్రస్తుతం 3), ఎస్టీలకు 2 నుంచి 3 స్థానాలు (ప్రస్తుతం 2 ) దక్కే అవకాశం ఉంది. ఇప్పటివరకు 1971 జనాభా ఆధారంగా సీట్ల కేటాయింపు, 2001 జనాభా ఆధారంగా నియోజకవర్గాల విభజన జరిగింది. కానీ కొత్త బిల్లులోని సెక్షన్ 4(బీ), సెక్షన్ 9(1) ప్రకారం తాజా జనగణన లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది.
కీలకంగా రొటేషన్ విధానం
మహిళా రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీ మహిళల సబ్ -కోటా, రొటేషన్ విధానం అత్యంత కీలకంగా మారనుంది. బిల్లులోని నిబంధనల ప్రకారం మహిళలకు కేటాయించే మూడింట ఒక వంతు సీట్లలోనే ఎస్సీ, ఎస్టీ మహిళల సీట్లు అంతర్భాగంగా ఉంటాయి. ఉదాహరణకు ఎస్సీలకు 31–32 అసెంబ్లీ సీట్లు వస్తే, అందులో మూడింట ఒక వంతు అంటే 10 నుంచి 11 స్థానాలు ఎస్సీ మహిళలకు రిజర్వ్ అవుతాయి. అలాగే ఎస్టీలకు వచ్చే 19 అసెంబ్లీ సీట్లలో 6 స్థానాలు ఎస్టీ మహిళలకు దక్కుతాయి. డీలిమిటేషన్ కమిషన్ ఈ మహిళా సీట్లను రొటేషన్ (మార్పు) పద్ధతిలో కేటాయిస్తుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేసే సీట్లను ఆయా ఎస్సీ లేదా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల పరిధిలోనే రొటేషన్ చేస్తారు తప్ప జనరల్ సీట్లకు మార్చరు. ఫలితంగా ప్రతి ఎన్నికల్లోనూ ఏ నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అవుతుందనే అంశం అభ్యర్థుల భవిష్యత్తును శాసించనుంది.
సెగ్మెంట్ల పునర్విభజనపై ఆసక్తి
నియోజకవర్గాల పునర్విభజన జరిగే తీరు, మండలాల సర్దుబాటుపైనా క్షేత్రస్థాయిలో ఆసక్తి నెలకొంది. బిల్లులోని సెక్షన్ 9(1)(బి) ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉండేలా సరిహద్దులను విభజించాలి. 179 నుంచి 182 అసెంబ్లీ స్థానాలను 26 లోక్‌సభ స్థానాలతో విభజిస్తే సగటున ఒక్కో ఎంపీ పరిధిలో 6 నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. కానీ ఒక నియోజకవర్గంలో కచ్చితంగా 6 లేదా 7 మండలాలే ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదు. కేవలం తాజా జనాభా, భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాల ఆధారంగానే సరిహద్దులు ఖరారవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 600కు పైగా మండలాలు ఉండగా, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఒక్కో సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే మండలాల సంఖ్య తగ్గుతుంది (గతంలో 5–6 మండలాలు ఉంటే 3–4కు తగ్గొచ్చు) . పట్టణ జనాభా పెరిగిన హైదరాబాద్, శివారు జిల్లాల్లో మున్సిపల్ డివిజన్ల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.
అసెంబ్లీ సీట్లు.. 182
డీలిమిటేషన్ బిల్లులోని సెక్షన్ 10 ప్రకారం అసెంబ్లీ సీట్లు 50 శాతం పెరుగుతాయి. అంటే ప్రస్తుత 119 సీట్లపై 50 శాతం పెంచితే 179 (178.5 కి రౌండ్ ఫిగర్) కావాలి. కానీ ఒక రాష్ట్రంలోని ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నీ సమానంగా ఉండాలని బిల్లులో పేర్కొన్నారు. సగటున 7 చొప్పున అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేలా లెక్కిస్తే అసెంబ్లీ స్థానాల సంఖ్య182 కి చేరుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
మహిళలకు 60 సీట్లకుపైనే..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 106వ రాజ్యాంగ సవరణ (నారీ శక్తి వందన్ అధినియమ్) అమలుకు ఈ డీలిమిటేషన్ బిల్లు వీలు కల్పిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 334ఏ ప్రకారం డీలిమిటేషన్ పూర్తయిన వెంటనే మహిళా కోటా అమల్లోకి వస్తుందని బిల్లు సెక్షన్ 8(సీ), సెక్షన్ 10 స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రకారం 179 లేదా 182 అసెంబ్లీ సీట్లలో మూడింట ఒక వంతు అంటే 59 నుంచి 61 స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. అలాగే 26 లోక్‌సభ స్థానాల్లో 8 నుంచి 9 సీట్లు మహిళలకే దక్కుతాయి. మొత్తం సీట్లను 50 శాతం పెంచడంతో ప్రస్తుతం ఉన్న జనరల్ పురుష అభ్యర్థుల సీట్ల సంఖ్యకు ఎలాంటి కోత పడకుండానే మహిళలకు మూడింట ఒక వంతు కోటా కేటాయించే వెసులుబాటు కలుగుతుంది.
