చెన్నై: డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన విజ్ఞప్తిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తిరస్కరించారు. ఈ పరిణామంతో ప్రతిపక్ష ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు మరోసారి బయటపడ్డాయి. చెన్నైలో ఆదివారం స్టాలిన్‌తో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సుమారు గంటపాటు సమావేశమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలన్నీ ఒకే వైఖరితో ముందుకు వెళ్లాలని వారు స్టాలిన్‌ను కోరారు. అయితే.. తమిళనాడు ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసిన స్టాలిన్, ఈ విషయంలో తన వైఖరిని మార్చుకునేందుకు నిరాకరించారు.
డీలిమిటేషన్ ప్రక్రియలో తమిళనాడుకు అన్యాయం జరగకూడదన్నది డీఎంకే ప్రధాన డిమాండ్. ముఖ్యంగా లోక్‌సభలో తమిళనాడు ప్రస్తుత ప్రాతినిధ్యం తగ్గకూడదని, పార్లమెంటు స్థానాల సంఖ్య పెరిగితే రాష్ట్రాల మధ్య న్యాయమైన నిష్పత్తి కొనసాగాలని స్టాలిన్ కోరుతున్నారు. 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలన్నది కూడా డీఎంకే వాదనగా ఉంది. గత డీలిమిటేషన్ పరిణామాలను ప్రస్తావించిన స్టాలిన్.. 1967లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తమిళనాడులో లోక్‌సభ స్థానాలు 41 నుంచి 39కి తగ్గాయని గుర్తుచేశారు.
ALSO READ : డీలిమిటేషన్‌పై ఎన్‌సీపీ(SP)లో అసమ్మతి.. మరో నేత రాజీనామా
ప్రస్తుత ప్రతిపాదనలో రాష్ట్రానికి స్థానాలు పెరిగే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మరోవైపు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియతో డీలిమిటేషన్‌ను అనుసంధానించడం కూడా ఈ వివాదంలో కీలక అంశంగా మారింది. ఈ సమావేశం ఎలాంటి ఏకాభిప్రాయం లేకుండానే ముగియడంతో ఇండియా కూటమిలో డీలిమిటేషన్‌పై భిన్న వైఖరులు స్పష్టమయ్యాయి.
