పెళ్లి తర్వాత మహిళలు సమాజంలో తమ వ్యక్తిగత గుర్తింపును కోల్పోవడం. కుటుంబ బాధ్యతల పేరుతో వారి ఆశలు, అభిరుచులు మరుగున పడుతున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాలను తెరపైకి తీసుకొస్తున్న చిత్రమే 'శ్రీమతి' (Srimathi). నివేదా థామస్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా డిసెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మగవారు గుడికి వెళ్లి లక్ష్మీదేవికి, అమ్మవారికి ఎంతో భక్తితో పూజలు చేస్తారు. కానీ ఇంట్లో ఉన్న మహిళలకు మాత్రం అదే స్థాయిలో గౌరవం ఇవ్వడం లేదు. ఆడవాళ్లు ఇంట్లో అన్ని పనులు చేయడానికి రోబోలు కాదు. మగవారిలాగే మాకూ అలసట ఉంటుంది, బాధలుంటాయి. ఒక మహిళే పురుషుడికి జన్మనిస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. మహిళలకు కూడా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు అంటూ తన అభిప్రాయాన్ని రేణు దేశాయ్ వ్యక్తం చేశారు.
అంతేకాదు.. ఈ సినిమాలో తిరువీర్ పోషించిన పాత్రకు, నిజజీవితంలో అతడి వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందని రేణు దేశాయ్ చెప్పారు. తిరువీర్ నాకు సొంత తమ్ముడిలాంటి వాడు. అతడి భార్య కల్పన నాకు బాగా తెలుసు. నిజజీవితంలో తన భార్యకు ఎంతో సపోర్ట్‌గా ఉంటాడు. భర్త అంటే తిరువీర్లా ఉండాలి. ప్రతి మహిళకు ఇలాంటి భర్త దొరికితే ఎంతో బాగుంటుంది అని ప్రశంసించారు. 'శ్రీమతి' వంటి కథాంశంతో తెరకెక్కిన సినిమాలు ప్రతి భాషలోనూ రీమేక్ కావాలని ఆకాంక్షించారు.
ALSO READ : Salman Khan: వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ రూ.కోటి వాచ్ గిఫ్ట్.. 'మాన్స్టర్' సెట్స్‌లో సర్ప్రైజ్!
ఇక రెండేళ్ల విరామం తర్వాత నివేదా థామస్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో ఆమె మధ్యతరగతి గృహిణి మధుశ్రీగా కనిపించనున్నారు. మహిళల ఆత్మగౌరవం, కుటుంబ బంధాలు, భార్యాభర్తల మధ్య అవగాహన వంటి అంశాలను దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. మరి థియేటర్లకు కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తున్న 'శ్రీమతి' ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో డిసెంబర్ 4న తెలియనుంది...
