దోహాలో జరిగిన 8వ ఫ్యాషన్ ట్రస్ట్ అరేబియా ప్రైజ్ వేడుకలో ఇషా అంబానీ ప్రత్యేకమైన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎప్పటిలాగే తన ఫ్యాషన్ స్టైల్‌తో మెస్మరైజ్ చేసిన ఆమె.. ఈసారి ఏకంగా 190 క్యారెట్ల వజ్రాలు పొదిగిన గౌనుతో మెరిసిపోయారు. ఈ వజ్రాలు మరెవరివో కాదు.. ఆమె తల్లి నీతా అంబానీ వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్‌కు చెందినవి.
లండన్‌కు చెందిన ప్రముఖ హాట్ కౌచర్ బ్రాండ్ 'స్టాండింగ్ గ్రౌండ్' ఇషా కోసం ప్రత్యేకంగా ఈ గౌనును రూపొందించింది. ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆండ్రూ ముకమల్ ఆమె లుక్‌ను డిజైన్ చేశారు. నవంబర్ 29న ఆయన ఇషా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ ప్రత్యేకమైన గౌను గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి.
స్టాండింగ్ గ్రౌండ్ ఫాల్ 2026 కౌచర్ కలెక్షన్‌లోని డిజైన్ ఆధారంగా ఈ గౌనును ప్రత్యేకంగా తయారు చేశారు. ముదురు గోధుమ రంగు వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో పాటు అందమైన ఎంబ్రాయిడరీ, మెరిసే వజ్రాలతో ఈ డ్రెస్‌ను ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
గౌనులో హైలైట్‌గా 190 క్యారెట్ల వజ్రాలు!
ఇషా అంబానీ ధరించిన గౌనులో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం 190 క్యారెట్ల వజ్రాల అలంకరణ. గౌను పైభాగంలో మధ్యలో నిలువుగా అమర్చిన ఈ వజ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విలువైన వజ్రాలను నీతా అంబానీ తన వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్ నుంచి ఇచ్చినట్లు సమాచారం.
ఫ్యాషన్ ఎక్స్పర్ట్ జాక్ సావోయి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వజ్రాల్లో అతిపెద్దది ఏకంగా 52 క్యారెట్లకు పైగా బరువు ఉంటుందట. అంతేకాదు, పియర్, రౌండ్, హార్ట్, ఎమరాల్డ్ వంటి విభిన్న ఆకారాల్లో ఉన్న వజ్రాలను ఈ గౌనుపై అందంగా అమర్చారు. వెల్వెట్ గౌనుపై మెరిసే ఈ వజ్రాలు మొత్తం లుక్‌కే ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాయి.
ఇషా అంబానీ గౌను ప్రత్యేకతలు
ఈ గౌను కేవలం వజ్రాల వల్లే కాదు.. దాని డిజైన్ వల్ల కూడా ప్రత్యేకంగా నిలిచింది. ముదురు గోధుమ రంగులో రూపొందించిన ఈ డ్రెస్‌కు భుజాలపై పట్టీలు లేకుండా, అందమైన వంపులతో నెక్ డిజైన్ ఇచ్చారు.
పైభాగం శరీరానికి చక్కగా సరిపోయేలా కార్సెట్ స్టైల్‌లో రూపొందించారు. కింద భాగంలో వెల్వెట్ స్కర్ట్‌ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మధ్యలో చేసిన ప్రత్యేకమైన మడతల అలంకరణ గౌనుకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.
వెనుకవైపు చిన్న ట్రైన్, చేతులకు సరిపోయే వెల్వెట్ గ్లోవ్స్, మెడ చుట్టూ ధరించిన స్కార్ఫ్‌తో ఇషా తన లుక్‌ను ఫినిష్ చేశారు. మొత్తంగా ఈ డ్రెస్ ఆమెకు రాయల్ లుక్‌ను తీసుకొచ్చింది.
దోహా వేడుకలో మరో ప్రత్యేక కార్యక్రమం
ఈ ఫ్యాషన్ వేడుకలో ఇషా అంబానీ కేవలం తన అందమైన లుక్‌తోనే కాకుండా మరో ప్రత్యేక కార్యక్రమంతోనూ వార్తల్లో నిలిచారు. స్వదేశ్ సంస్థ సహకారంతో రూపొందించిన తొలి నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ రెసిడెన్సీ అవార్డును ఆమె ప్రదానం చేశారు.
ఈ అవార్డు ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఫ్యాషన్ ట్రస్ట్ అరేబియా ద్వారా ఎంపికైన ఓ డిజైనర్‌కు భారతీయ నిపుణులైన కళాకారులతో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించడం. తద్వారా మన దేశంలోని సంప్రదాయ కళలు, హస్తకళల గురించి తెలుసుకోవడంతో పాటు వాటిని నేర్చుకునే అవకాశం లభిస్తుంది.
మొత్తానికి, 190 క్యారెట్ల వజ్రాలు పొదిగిన ప్రత్యేకమైన గౌనుతో ఇషా అంబానీ దోహా ఫ్యాషన్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లి నీతా అంబానీ ఆభరణాలను తన ఫ్యాషన్ లుక్‌లో భాగం చేసుకోవడం ఈ డ్రెస్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
