పాకిస్తాన్‌లో ఫన్నీ సీన్.. 90 గ్రాములని 90 రూపాయలుగా పలికిన మహిళా అధికారి.. చివరికి ఏమైందంటే !

పాకిస్తాన్‌లో ఫన్నీ సీన్.. 90 గ్రాములని 90 రూపాయలుగా పలికిన మహిళా అధికారి.. చివరికి ఏమైందంటే !

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఓ మహిళా ప్రభుత్వ అధికారి చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ తందూర్‌లో రోటి(Roti) బరువును చెక్ చేస్తున్న సమయంలో, 90 గ్రాములని పొరపాటున 90 రూపాయలు అని అనడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పంజాబ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (PERA)  అఫీషియల్  సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. అప్పటి నుంచి ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలు ఏం జరిగిందంటే 
లాహోర్‌లోని నిష్తర్ తహసీల్ ప్రాంతంలో ఉన్న ఓ తందూర్‌లో PERA అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు, నిర్దేశించిన బరువుకు అనుగుణంగా రొట్టెలు అమ్ముతున్నారా లేదా అని పరిశీలించారు. ఈ క్రమంలో మహిళా అధికారి దుకాణదారుడైన  మహమ్మద్ రియాజ్‌ను రోటీల ధరలు, ప్రభుత్వ ధరల పట్టిక గురించి అడిగారు.

దీనికి దుకాణదారుడు ఒక్కో రొట్టెను రూ.18 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నట్లు చెప్పాడు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.14 అని, రోటి కనీసం 100 గ్రాముల బరువు ఉంటే రూ.17 వరకు అమ్ముకోవచ్చని మహిళా అధికారి వివరించారు.

అయితే పిండి, కట్టెల ధరలు బాగా పెరిగిపోయాయని, చిన్న వ్యాపారాలు నడపడం కష్టంగా మారిందని దుకాణదారుడు తన ఇబ్బందులను చెప్పుకున్నాడు. ప్రభుత్వం నుంచి పిండి తెచ్చుకోవడం కూడా అంత సులభం కాదని తెలిపాడు.

దీనికి స్పందించిన అధికారిణి.. ప్రభుత్వ ధరల పట్టికను తప్పనిసరిగా దుకాణంలో ఉంచాలని సూచించారు. అలాగే పిండి కోసం మిల్లులు, ప్రభుత్వ అనుమతి ఉన్న కేంద్రాలను సంప్రదించాలని చెప్పారు.

90 గ్రాములను 90 రూపాయలుగా పలికిన అధికారిణి
ఇక ఈ తనిఖీలో ఓ ఫన్నీ సీన్  జరిగింది. రొట్టె బరువు ఎంత ఉందో తెలుసుకోవడానికి మహిళా అధికారి దాన్ని ఎలక్ట్రానిక్ వెయిట్  మెషిన్ పై పెట్టారు. వెయిట్ మెషిన్ పై 90 గ్రాములు అని చూపించింది. అయితే ఆమె వెంటనే '90 రూపాయలు' అని పలకడంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వెంటనే సరిదిద్దుకుంటూ రోటి  బరువు 90 గ్రాములని, ప్రభుత్వం నిర్ణయించిన 100 గ్రాముల కంటే తక్కువగా ఉందని అన్నారు.

ALSO READ : లాస్ ఏంజిల్స్‌లో 5.0 తీవ్రతతో భారీ భూకంపం.. గాలిలోనే ఆగిపోయిన విమానం

దీనిపై దుకాణదారుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రోటి చల్లారిన తర్వాత బరువు తగ్గుతుందని, చెక్ చేసే విధానం సరిగ్గా లేదని వాదించాడు. చివర్లో దుకాణదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నోటీసు వస్తుందని... జాజ్‌క్యాష్ లేదా ఈజీపైసా ద్వారా జరిమానా కట్టాలని  మహిళా అధికారిణి తెలిపారు.  రోటి ధర విషయంలో రూ.20 జరిమానా విధించినట్లు, అయితే బరువు తక్కువగా ఉన్నందుకు  ఎలాంటి జరిమానా విధించలేదని ఆమె వివరించారు.

సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు
ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నెటిజన్లు మహిళా అధికారి  చేసిన పొరపాటుపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

"90 రూపాయల బరువు అంట..!" అంటూ ఒకరు కామెంట్ చేయగా.. "గ్రాములకు బదులుగా రూపాయలు చెప్పేశారు" అంటూ మరొకరు నవ్వుకున్నారు. ఇంకొందరు నవ్వుతున్న ఎమోజీలతో వీడియోపై స్పందించారు. అయితే అందరూ ఈ ఘటనను సరదాగా తీసుకోలేదు. కొందరు మాత్రం చిన్న చిన్న వ్యాపారులను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.

"పాపం పేద వ్యాపారులను వదిలేయండి. ఈ మహిళా అధికారి తన ఇంట్లో కూడా రొట్టెల బరువు కొలుస్తుందా?" అంటూ ఓ నెటిజన్ అసహనం వ్యక్తం చేశారు.

మొత్తానికి, రొట్టె బరువు చెక్  చేయడానికి వెళ్లిన మహిళా అధికారి చెప్పిన ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది.