A Perfect Cup of Tea: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 (Rising Stars Asia Cup 2026) ఫైనల్‌కు పాకిస్థాన్ షాహీన్స్ అర్హత సాధించిన వేళ, పాక్ స్పిన్నర్ సుఫియాన్ ముకీమ్ మరోసారి తన నీచ బుద్ధిని బయటపెట్టుకున్నాడు. క్రీడాస్ఫూర్తిని మంటగలిపేలా, టీ కప్పు పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఒక అద్భుతమైన కప్పు టీ, ఇంకా పూర్తికాని కథ (A perfect cup of tea and unfinished story) అంటూ చిల్లరగాడిలా క్యాప్షన్ పెట్టాడు. 2019లో భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఘటనను పరోక్షంగా లాగుతూ ముకీమ్ చేసిన ఈ చీప్ సెటైర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హర్షిత్ రాణాతో గొడవ.. ఫైనల్ ఆశలు గల్లంతు:
ఈ టోర్నీ ఫైనల్‌లో మరోసారి భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ సెమీఫైనల్‌లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఆ అవకాశం చేజారింది. అంతకుముందు గ్రూప్ దశలో భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్ల మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ మ్యాచ్‌లో సుఫియాన్ ముకీమ్, భారత పేసర్ హర్షిత్ రాణా మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తమ బ్యాటర్లు క్రీజులోకి వచ్చినప్పుడు హర్షిత్ రాణా అసభ్య పదజాలం వాడాడని ముకీమ్ ఆ తర్వాత ఆరోపించాడు. ఇప్పుడు పాక్ జట్టు ఫైనల్ చేరడం, భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ముకీమ్ ఈ టీ పోస్ట్‌తో తన అక్కసు వెళ్లగక్కాడు.
అసలు ఏమిటీ ఫెంటాస్టిక్ టీ వివాదం:
2019 ఫిబ్రవరిలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన గగనతల పోరులో భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ నడుపుతున్న మిగ్-21 విమానం కూలిపోయింది. పాకిస్థాన్ భూభాగంలో దిగిన ఆయనను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో పాక్ అధికారులు అభినందన్ టీ తాగుతున్న వీడియోను రిలీజ్ చేశారు. టీ ఎలా ఉంది? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఎంతో హుందాగా "ది టీ ఈజ్ ఫెంటాస్టిక్" అని ఆన్సర్ ఇచ్చారు. అప్పటి నుంచి పాకిస్థాన్‌లో కొందరు ఆటగాళ్లు టీమిండియాను ఎగతాళి చేసేందుకు ఈ 'టీ' రెఫరెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ పాకిస్థాన్ ఛానెల్ ఒకటి ఇదే తరహా యాడ్‌తో వివాదం రేపింది.
A perfect cup of tea and unfinished story ☕️ https://t.co/YzqZkQP0NY
— Sufiyan Moqim 13 (@RealSufiyan_M) November 28, 2026
