డీలిమిటేషన్ తర్వాత మంత్రుల ఖర్చు రూ.వెయ్యి కోట్లు : సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే

డీలిమిటేషన్ తర్వాత మంత్రుల ఖర్చు రూ.వెయ్యి కోట్లు : సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే

డీలిమిటేషన్ బిల్లుపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో ఎలాంటి లాభం ఉండదన్నారు.  లోక్‌సభ స్థానాలు, మంత్రిమండలి సభ్యుల సంఖ్య పెంచడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని.. దీనివల్ల పన్ను ట్యాక్స్ పేయర్స్ మనీ వృథా అవుతుందని 2029 నవంబర్ 29న ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 68 మంది మంత్రుల కోసం ఏడాదికి  620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అభిజిత్ దీప్కే తెలిపారు. ఒక్కో మంత్రిపై సగటున రూ.9.1 కోట్లు ఖర్చవుతోందని పేర్కొన్నారు. పునర్విభజన తర్వాత మంత్రిమండలి గరిష్ట సామర్థ్యం 81 నుంచి 122కు పెరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు. అదనంగా వచ్చే 41 మంది మంత్రుల కోసం ప్రభుత్వం ఏడాదికి మరో రూ.374 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. లోక్‌సభ, మంత్రిమండలి విస్తరణ వల్ల రాజకీయ నాయకులకు తప్ప సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026ను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులో లోక్‌సభ స్థానాల గరిష్ట సంఖ్యను 850కి పెంచాలని ప్రతిపాదించారు. ఇందులో రాష్ట్రాల నుంచి 815, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీలల  సభ్యుల సంఖ్యను కూడా పెంచేందుకు  ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం కూడా ఈ బిల్లులో ఉంది.

ఈ ప్రతిపాదిత చట్టాన్ని ఇండియా కూటమి వ్యతిరేకిస్తోంది. పునర్విభజన ప్రక్రియ వల్ల షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపించాయి. బీజేపీ తన రాజకీయ బలాన్ని సుస్థిరం చేసుకునేందుకే ఈ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.