మోసం చేస్తే జరిగేది ఇదే.. బ్రహ్మ ఐదో తలను ఖండించిన పరమేశ్వరుడు.. శివుడి ఉగ్రరూపం నుంచి జన్మించిన కాలభైరవుడు

మోసం చేస్తే జరిగేది ఇదే..  బ్రహ్మ ఐదో తలను ఖండించిన పరమేశ్వరుడు.. శివుడి ఉగ్రరూపం నుంచి జన్మించిన కాలభైరవుడు

శివుడి ఉగ్రరూపమైన కాలభైరవుడు ఎలా ఆవిర్భవించాడు? బ్రహ్మదేవుడి ఐదో తలను ఎందుకు ఖండించాడు? కాశీ కొత్వాల్‌గా ఎలా మారాడు? కాలభైరవుడి ఆవిర్భావం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటి..   బ్రహ్మదేవుడి ఐదో తలను ఎందుకు ఖండించారు?మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం. . !

పరమేశ్వరుడి కాలభైరవుడిగా కార్తీకమాసం  కృష్ణ పక్షంలో బహుళ అష్టమి రోజున జన్మించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.  అందుకే ఆ రోజును కాలభైరవాష్టమి అంటారు.  పరమ శివుని ఉగ్ర, శక్తివంతమైన రూపమైన కాలభైరవుడి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని కాలభైరవ జయంతిని జరుపుకుంటారు.

ఈ ఏడాది ( 2026) కాలభైరవి అష్టమి  పండుగను డిసెంబర్ 1, మంగళవారం నాడు జరుపుకోనున్నారు. పురాణాల  ప్రకారం, కాలభైరవుడు కాలానికి అధిపతి, న్యాయానికి ప్రతిరూపం. భక్తులను భయం, ప్రతికూల శక్తులు, కష్టాల నుంచి రక్షించే దేవుడిగా ఆయనను కొలుస్తారు. 

కాశీ క్షేత్రానికి రక్షకుడిగా ఉండటంతో ఆయనకు ‘కాశీ కొత్వాల్’ అనే పేరు కూడా ఉందని పండితులు చెబుతున్నారు.  కాలభైరవుడి పేరు వినగానే అధర్మాన్ని, అహంకారాన్ని, దుష్టశక్తులను అంతం చేసే ఉగ్రరూపం గుర్తుకొస్తుంది.

కాశీకి రక్షకుడిగా కాలభైరవుడు

బ్రహ్మదేవుడి ఐదో తలను ఖండించిన కారణంగా కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. బ్రహ్మ పుర్రె ఆయన చేతికి అతుక్కుపోయి విడిపోలేదు. ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి కాలభైరవుడు మూడు లోకాల్లో సంచరించాడు. చివరకు కాశీ క్షేత్రంలోని కపాలమోచన తీర్థానికి చేరుకోగానే ఆయనకు బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తి లభించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత శివుడు కాలభైరవుడిని కాశీ నగరానికి రక్షకుడిగా నియమించాడు. అప్పటి నుంచి ఆయనను ‘కాశీ కొత్వాల్’గా పిలుస్తున్నారు. ఆయన చేతిలో దండం ఉండటం వల్ల దండపాణి అని కూడా అంటారు. కుక్క ఆయన వాహనంగా ప్రసిద్ధి చెందింది.

కాలభైరవ జయంతి పూజా విధానం

  • కాలభైరవ జయంతి  ( డిసెంబర్​ 1) తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి శివుడిని, కాలభైరవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. 
  • స్వామివారి ముందు ఆవాల నూనెతో దీపం వెలిగించి ‘ఓం కాలభైరవాయ నమః’ మంత్రాన్ని జపించడం శుభప్రదంగా భావిస్తారు. 
  • వీలైనవారు కాలభైరవ అష్టకం పారాయణం చేయవచ్చు.
  • నల్ల కుక్కకు రొట్టెలు లేదా ఆహారం పెట్టాలి.
  •  ఇలా చేయడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం లభించి భయాలు, కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
  • కాలభైరవుడిని ఆరాధిస్తూ తమ జీవితాల్లో సుఖశాంతులు, ధైర్యం, రక్షణ కలగాలని ప్రార్థిస్తారు.

బ్రహ్మ, విష్ణువుల మధ్య ఆధిపత్య పోరు

పురాణాల ప్రకారం..ఒకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్పవారనే విషయంపై వాదించుకున్నారు. ఇద్దరూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శివుడు అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతిర్లింగానికి ఆది, అంతం కనుక్కోవాలని సవాలు విసిరాడు.

విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్లగా, బ్రహ్మదేవుడు హంస రూపంలో పైభాగాన్ని కనుగొనడానికి బయలుదేరాడు. ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ జ్యోతిర్లింగం ఆది, అంతాలు కనిపించలేదు.

బ్రహ్మ అహంకారాన్ని అణచిన కాలభైరవుడు

విష్ణుమూర్తి తనకు జ్యోతిర్లింగం ఆది అంతాలు తెలియలేదని నిజాన్ని అంగీకరించాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే అహంకారంతో జ్యోతిర్లింగ శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. అంతేకాకుండా శివుడిని అవమానించేలా మాట్లాడాడు. 

దీంతో పరమశివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ సమయంలో శివుడి ఉగ్రరూపం నుంచి కాలభైరవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడి అహంకారాన్ని అణచివేయాలని శివుడు ఆదేశించడంతో, కాలభైరవుడు తన గోరుతో బ్రహ్మదేవుడి ఐదో తలను ఖండించాడు. ఇలా బ్రహ్మలోని అహంకారాన్ని అంతం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.