ఆజ్ఞాపించే అధికారం ఉన్నవారు మనకు ఏదైనా పని ఆదేశిస్తే ఆ పనిని ధిక్కరించడం నేరమే. అయితే ఆ ఆజ్ఞలోని సారాన్ని, సారాంశాన్ని అర్థం చేసుకొని ఆదేశాన్ని శిరసావహించడం చాలా అవసరం. ఒక్కోసారి అనుచితమైన ఆజ్ఞలు కూడా వస్తుంటాయి. ఆ సమయంలో ఉచితానుచితాలు గమనించుకోవాలి.
అనగనగా ఒక అడవిలో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో బదరీనాథుడు అనే గురువు ఉండేవాడు. ఆ గురువుగారికి పెళ్లి వయసుకి వచ్చిన కుమార్తె ఉంది. బుద్ధిమంతుడైన వానికి ఇచ్చి పెళ్లి చేయాలని సంకల్పించాడు. అందుకోసం ఆ ఆశ్రమం పరిసరాలలో ఉన్న వారందరికీ ఒక పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో నెగ్గినవానికే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని ఆలోచన చేశాడు.
వెంటనే చాటింపు వేయించి అందరినీ సమావేశపరచి, ‘నాయనలారా! మీరంతా నా బోధనలు వింటూ జీవనం సాగిస్తున్నారు. మీలో కొందరు ధనవంతులు, కొందరు సామాన్యులు, మరికొందరు పేదవారు ఉన్నారు. నేను ఏది కోరితే అది మీరు నాకు ఇస్తారు. అయితే నేను ఎవ్వరినీ యాచించను. నా కూతురి వివాహం కోసం మీరంతా.. ఎవ్వరికీ తెలియకుండా దొంగతనం చేసి డబ్బు తీసుకొని రావాలని మిమ్మల్ని ఆదేశిస్తున్నాను’ అన్నాడు.
వెంటనే అక్కడకు వచ్చిన యువకులందరూ తలో దిక్కుకు వెళ్లి, రకరకాల ఆభరణాలు, ధనం, వజ్రవైఢూర్యాలను ఎవరూ చూడకుండా తెచ్చి ఆయన ముందు ఉంచారు. కాని ప్రమోద్ అనే ఒక యువకుడు మాత్రం ఏమీ తేకుండా వచ్చాడు.
మరునాడు వారందరినీ సమావేశపరచి, ‘నా కోరిక మేరకు మీరందరూ మీకు తోచిన విధంగా విలువైన వస్తువులు తీసుకువచ్చారు. కాని ప్రమోద్ మాత్రం ఖాళీ చేతులతో వచ్చాడు. కారణం ఏమిటి?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా ప్రమోద్, ‘స్వామీ! మీ ఆజ్ఞ ప్రకారం నేను కూడా దొంగిలించాలనుకున్నాను. కాని మీరు ఎవరికీ తెలియకుండా తీసుకుని రావాలన్నారు. కుడి చేత్తో చేసే దొంగతనం ఎడమ చేతికి కూడా తెలియకూడదన్నారు.
మనం ఏం చేసినా మన ఆత్మ, భగవంతుడు చూస్తూనే ఉంటారు. అటువంటప్పుడు నేను ఎవరికీ తెలియకుండా దొంగతనం చేయడం కుదరదు కదా’ అన్నాడు. బదరీనాథుడు సంతోషించాడు. ‘నువ్వు నా మాటలను సక్రమంగా అర్థం చేసుకున్నావు. నాయనలారా! తప్పు చేయమని ఎంతటివారు ఆదేశించినా అటువంటి ఆజ్ఞలు పాటించకూడదు. నా కూతురి వివాహం కోసం మీ అందరికీ పరీక్ష పెట్టాను. ఇందులో ప్రమోద్ ఒక్కడే గెలిచాడు. నేను నా కూతురి వివాహం ప్రమోద్‌తో జరిపిస్తాను’ అన్నాడు. వారంతా తప్పు తెలుసుకున్నారు. ఎంతటివారు ఆదేశించినా... న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని అతిక్రమించకూడదని ఈ కథ వివరిస్తోంది.
ఇక రామాయణం విషయానికి వస్తే
రావణాసురుడు తన తమ్ముడైన విభీషణుడిని రాముడికి వ్యతిరేకంగా యుద్ధం చేయమని ఆజ్ఞాపించగా, అందుకు విభీషణుడు తిరస్కరించాడు. నగర బహిష్కరణకు గురయ్యాడు. రామునితో స్నేహం చేశాడు. రామరావణుల మధ్య జరిగిన యుద్ధంలో రావణుడు తన బంధుపరివారంతో సహా మరణించాడు. అప్పుడు విభీషణుడే లంకాధిపతి అయ్యాడు. అన్నగారి చెడు ఆజ్ఞను విభీషణుడు వివేకంతో తిరస్కరించడం వల్లే లంకా నగరాన్ని ఆ వంశానికి చెందిన విభీషణుడు పరిపాలించగలిగాడు.
ఒకసారి ఒక నక్క, ఒక కుందేలు అడవిలో ప్రయాణిస్తున్నాయి. మార్గ మధ్యంలో వాటికి ఒక సింహం కనిపించింది. అప్పుడు నక్క కుందేలుతో, ‘నువ్వు వెళ్లి ఆ నిద్రపోతున్న సింహం మీదికి ఎగిరి అల్లరి చేసిరా . నీకు చాలా దుంపలు ఇస్తాను’ అంది. ఆ మాటకు కుందేలు, ‘అనవసరంగా చెడు పనులు చేయమని చెప్పకు. నీ మాట వింటే నన్ను ఆ సింహం ఒక్క దెబ్బతో చంపేస్తుంది’ అని పలికింది.
మహాభారతంలో ..
దుర్యోధనుడికి శకుని నిరంతరం చెడు ఆలోచనలను కలిగిస్తూనే వచ్చాడు. అసలే దుష్టస్వభావం కలవాడేమో, అగ్నికి ఆజ్యం పోసినట్లు దుర్యోధనుడికి శకుని మాటలు బాగా నచ్చాయి. దుశ్శాసనుడు, కర్ణుడు సైతం తమ వంతుగా దుర్యోధనుడు చెడ్డ పనులు చేసేలా ప్రేరేపించారు. అందువల్లే దుష్టచతుష్టయంగా స్థిరపడ్డారు. శ్రీకృష్ణుడు బోధించే మంచి మాటలు వారి చెవికి ఎక్కలేదు. కాని పాండవులు మాత్రం అనుక్షణం శ్రీకృష్ణుని సూచనలను పాటించారు. అందువల్లే వారు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు.
- డా. పురాణపండ వైజయంతి
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
