బస్సు, లారీ మధ్య కారు నుజ్జు నుజ్జు.. టంగుటూరు టోల్ గేట్ ప్రమాదంలో నలుగురు మృతి

బస్సు, లారీ మధ్య కారు నుజ్జు నుజ్జు.. టంగుటూరు  టోల్ గేట్ ప్రమాదంలో నలుగురు మృతి

ప్రకాశం జిల్లాలోని టంగుటూరు టోల్‌గేట్ దగ్గర తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ఫీజు చెల్లించేందుకు ఆగి ఉన్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు ముందు ఉన్న ప్రైవేట్ బస్సుకు, వెనుక ఉన్న లారీకి మధ్య చిక్కుకుని పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 ఏళ్ల బాలుడు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.

 అద్దంకి మండలం బొమ్మనంపాడు, చెరుకుంపాలెం ప్రాంతాలకు చెందిన ఐదుగురు బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టంగుటూరు టోల్‌గేట్ వద్ద టోల్ ఫీజు చెల్లించేందుకు కారు ఆగి ఉండగా వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు రెండు భారీ వాహనాల మధ్య నలిగిపోయింది.

ప్రమాదం ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, 15 ఏళ్ల బాలుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రమాదం తర్వాత మృతదేహాల మధ్య చిక్కుకున్న బాలుడు బోరున విలపించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. ఒకే ప్రయాణంలో స్వగ్రామానికి వస్తున్న కుటుంబ సభ్యులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.