- పెరుగుతున్న చలి తీవ్రతతో వణుకుతున్న గిరిజన ప్రాంతాలు
శీతాకాలం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతమైన వంజంగి కొండలు తెల్లని మంచు తెరలతో కనువిందు చేస్తున్నాయి. కొండలపై పరుచుకున్న పొగమంచు, మేఘాలను తాకుతున్నట్లుగా కనిపించే హిమ శిఖరాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
ఉదయం వేళల్లో మంచు పొరల మధ్య నుంచి తొంగిచూసే సూర్యకిరణాలు కొండకోనలకు మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. పచ్చని కొండలు, తెల్లని మంచు తెరలు, చల్లని గాలులతో ఏజెన్సీ ప్రాంతాలు ప్రకృతి చిత్రంలా దర్శనమిస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు వంజంగితో పాటు పలు గిరిజన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరిగింది. గడ్డకట్టించే చలితో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఒకవైపు కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు.. మరోవైపు వణికిస్తున్న చలి తీవ్రతతో అల్లూరి ఏజెన్సీ ప్రాంతాలు శీతాకాలపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
