వైఫై లేదు.. పుస్తకమే ప్రపంచం! ట్రెండ్ సెట్ చేస్తున్న హైదరాబాద్ కోఫోర్జ్ లైబ్రరీ

వైఫై లేదు.. పుస్తకమే ప్రపంచం! ట్రెండ్ సెట్ చేస్తున్న హైదరాబాద్ కోఫోర్జ్ లైబ్రరీ

పుస్తకం తెరిస్తే కొత్త ప్రపంచం పరిచయమవుతుంది.. పేజీ తిప్పితే కొత్త ఆలోచన పుడుతుంది. సమాచారం కోసం ఇంటర్నెట్‌‌ను ఆశ్రయిస్తున్న తరాన్ని జ్ఞానం కోసం పుస్తకాల వైపు నడిపిస్తూ, డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ విజ్ఞానం పంచుతూ.. పుస్తకమే నిజమైన నేస్తమని చాటుతోంది ఈ అక్షర లోకం.  మొబైల్ చేతిలో ఉంటే ప్రపంచంలోని సమాచారమంతా అరచేతిలోకి వచ్చేస్తోంది. కానీ సమాచారాన్ని మించిన జ్ఞానాన్ని ఇచ్చేది పుస్తకమే.

 డిజిటల్ పుస్తకాలు వచ్చినా, పుస్తకాన్ని చేతిలో పట్టుకుని పేజీ తిప్పుతూ చదివే అనుభూతే వేరు. స్క్రీన్లకు అతుక్కుపోతున్న ఈ రోజుల్లో జనాన్ని మళ్లీ పుస్తకాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్ కొండాపూర్‌‌లోని ‘కోఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ’. వేలాది పుస్తకాలు, సెంట్రల్ ఏసీ వంటి ఆధునిక వసతులు, పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ప్రత్యేక విభాగాలతో ఉన్న ఈ గ్రంథాలయం.. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఆహ్వానం పలుకుతోంది. 

కొండాపూర్ ప్రణవ బిజినెస్ పార్క్ 8వ అంతస్తులో 15,660 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ లైబ్రరీ రూపుదిద్దుకుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 20 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఫిక్షన్, నాన్ ఫిక్షన్, కథలు, నవలలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, చరిత్ర, సైన్స్, పర్యావరణం, ఆధ్యాత్మికం, రాజకీయం, వ్యాపారం, మార్కెటింగ్, మేనేజ్‌‌మెంట్, క్రీడలు, సినిమా, ఫొటోగ్రఫీ, ట్రావెలాగ్‌‌లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీ పుస్తకాలూ ఇక్కడ దొరుకుతాయి. పాఠకులు అడిగిన పుస్తకాలను తెప్పిస్తున్నామని లైబ్రేరియన్ మెరుగు అశోక్ చెప్పారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం బ్రెయిలీ పుస్తకాలతో పాటు, వేలాది డిజిటల్ పుస్తకాలను వినిపించే ఐప్యాడ్‌‌లు కూడా అందుబాటులో ఉంచారు. దివ్యాంగుల కోసం వీల్‌‌చైర్ ఉంది.

ఐటీ కంపెనీ సామాజిక బాధ్యత

మొబైల్స్, ట్యాబ్‌‌లు వచ్చాక పుస్తక పఠనం తగ్గిపోవడం, ప్రభుత్వ లైబ్రరీల సంఖ్య తగ్గుతుండటం గమనించిన ఐటీ సంస్థ కోఫోర్జ్, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం–2013లోని సెక్షన్ 135 కింద నోయిడా, గురుగ్రామ్, ఢిల్లీ వసంత్ కుంజ్‌‌తో పాటు హైదరాబాద్ కొండాపూర్‌‌లో ఈ లైబ్రరీలు నడుపుతోంది. సిటీ పుస్తక ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో త్వరలో సికింద్రాబాద్‌‌లో మరో లైబ్రరీ పెడతామని హెడ్ లైబ్రేరియన్ నండూరి ఫణి భార్గవి తెలిపారు. గ్రంథాలయాలు లేని ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే, అన్ని వసతులతో పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ఏడాదిలో లక్ష మంది పాఠకులు

గతేడాది కాలంలో లైబ్రరీకి లక్ష మంది పాఠకులు వచ్చారని లైబ్రేరియన్ అశోక్ చెప్పారు. 365 రోజులూ ఉదయం 9 నుంచి రాత్రి 8.30 వరకు లైబ్రరీ తెరిచే ఉంటుంది. రోజూ 300 మందికి పైగా, వారాంతాల్లో 600 మంది దాకా వస్తున్నారు. ఉదయం సీనియర్ సిటిజన్లు దినపత్రికలు చదువుకోవడానికి, మధ్యాహ్నం లంచ్ టైమ్‌‌లో ఉద్యోగులు, సాయంత్రం కుటుంబాలతో కలిసి పాఠకులు వస్తున్నారని హెడ్ లైబ్రేరియన్ భార్గవి వివరించారు. ‘గణితం అంటే నాకు ఇష్టం. ఒక ఫార్ములా ఎలా పుట్టింది, దాని వెనుక చరిత్ర ఏంటో చదువుతుంటా. ఇక్కడ పుస్తకాల సేకరణ బాగుంది’ అని ఐటీ ఉద్యోగి కె.అశోక్ చెప్పారు. మొబైల్ యుగంలో పుస్తకం చదవడం మంచి అనుభూతినిస్తోందని పాఠకురాలు డి.కిరణ్మయి అన్నారు.

చిన్నారులకు పుస్తక ప్రపంచం

పిల్లల్లో పఠనాసక్తి పెంచేందుకు 5 వేల పుస్తకాలతో ప్రత్యేక కిడ్స్ జోన్ ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌‌లో కథల పుస్తకాలు, కామిక్స్, రంగుల బొమ్మల పుస్తకాలు, అద్భుత కథలు, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ పుస్తకాలు చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. పేరెంట్స్​ పిల్లలతో కలిసి కూర్చుని కథలు చదువుకునే వీలుంది. 

కిడ్స్ జోన్ పిల్లలకు ఉల్లాసభరిత వాతావరణం ఇస్తోందని, చిన్న వయసులోనే పుస్తకాలపై ఆసక్తి పెంచుతోందని చిన్నారి రోహిణి తల్లిదండ్రులు రాజేశ్వరి, ఆదిశేషు చెప్పారు. పిల్లల కోసం ట్రెజర్ హంట్, బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్, పాటలు, గేయాలు, పిల్లలే పుస్తకాలు చదివి వినిపించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భార్గవి తెలిపారు. జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘రీడింగ్ పాస్‌‌పోర్ట్’, ‘రీడింగ్ జర్నల్’ కార్యక్రమాలు మొదలుపెట్టారు; చదివిన పుస్తకాలు, నచ్చిన పాత్రలు, కొత్త పదాలు, నేర్చుకున్న విషయాలు పిల్లలు అందులో రాసుకుంటారు.

లైబ్రరీకి వెళ్లాలంటే..
చిరునామా: ప్రణవ బిజినెస్ పార్క్, 
8వ అంతస్తు, కొండాపూర్​
సమయం: రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 8.30 వరకు (ఏడాది పొడవునా)
ప్రవేశం: ఉచితం; మొబైల్ నంబర్‌‌తో 
రిజిస్టర్ చేసుకుని, రిసెప్షన్‌‌లో 
సైన్ ఇన్, సైన్ అవుట్ చేయాలి
పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లాలంటే: 
గుర్తింపు పత్రంతో రిజిస్టర్ చేసుకుని, 
తిరిగి ఇచ్చే డిపాజిట్ కట్టాలి

సర్కారు బడి పిల్లలకు బస్సుల్లో..

సిటీలోని సర్కారు బడులు, పేద పిల్లలు చదివే స్కూళ్ల విద్యార్థులను వారంలో సోమవారం నుంచి గురువారం వరకు బస్సుల్లో లైబ్రరీకి తీసుకొచ్చి పుస్తక ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నామని లైబ్రేరియన్ అశోక్ చెప్పారు. ఇప్పటిదాకా వందలాది మంది సర్కారు బడి పిల్లలకు ఈ అవకాశం కల్పించామన్నారు. 

వైఫై లేదు.. పుస్తకమే తోడు

ఈ లైబ్రరీలో మరో ప్రత్యేకత ఉంది: ఇక్కడ వైఫై సౌకర్యం లేదు. డిజిటల్ అంతరాయాలు లేకుండా ప్రశాంతంగా పుస్తక పఠనంపైనే దృష్టి పెట్టేలా కావాలనే ఈ ఏర్పాటు చేశారు. కావాల్సిన పుస్తకాన్ని డిజిటల్ క్యాటలాగ్‌‌తో సులభంగా వెతుక్కోవచ్చు.