వాషింగ్టన్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. యూఎస్ జీయోలాజికల్ సర్వే ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం (నవంబర్ 28) ఉదయం 9.30 గంటలకు ఈ భూకంపం వచ్చింది. మాన్‌హట్టన్ బీచ్‌కు నైరుతి దిశలో సుమారు 3.7 మైళ్ల దూరంలో, 7.6 మైళ్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శాంటా మోనికా, పసాడెనాతో సహా లాస్ ఏంజిల్స్ ప్రాంతమంతటా ప్రకంపనలు సంభవించాయని తెలిపింది.
విమానం ల్యాండింగ్ నిలిపివేత
సరిగ్గా భూమి కంపిస్తోన్న సమయంలోనే డెల్టా ఫ్లైట్ 1972 విమానం లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమై విమానాన్ని ల్యాండింగ్ కావొద్దని హెచ్చరించారు. ‘పెద్ద భూకంపం వస్తోంది, వెనక్కి తిరగండి’ అని పైలట్లకు సూచించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. దీంతో పైలట్ ల్యాండింగ్‌ను నిలిపివేసి విమానాన్ని మళ్లీ పైకి తీసుకెళ్లారు. భూకంపం వల్ల విమానాశ్రయ టెర్మినళ్లతో సహా పలు భవనాల్లో అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనల కారణంగా విమానం ఒక గంట 13 నిమిషాలు ఆలస్యంగా ల్యాండ్ అయింది.
40కి పైగా ప్రకంపనలు
తొలి భూకంపం తర్వాత కనీసం 40 ప్రకంపనలు నమోదైనట్లు యూఎస్జీఎస్ గణాంకాలు వెల్లడించాయి. 4.0 కంటే ఎక్కువ తీవ్రతతో మరో ప్రకంపన వచ్చే అవకాశం 30 శాతం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు పెద్దగా ఆస్తి నష్టం గానీ, ఎవరికీ గాయాలు గానీ జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు చెప్పారు.
భూకంపం నేపథ్యంలో నగరం అంతటా పరిస్థితులను అంచనా వేస్తున్నట్లు లాస్ ఏంజిల్స్ మేయర్ కారెన్ బాస్ చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, ప్రజలు ప్రకంపనల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. 2014లో లా హబ్రాలో వచ్చిన 5.1 తీవ్రత భూకంపం తర్వాత ఈ ప్రాంతంలో వచ్చిన అత్యంత బలమైన భూకంపం ఇదేనని నిపుణులు పేర్కొన్నారు. భూకంప ప్రభావాన్ని అంచనా వేయడానికి స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు కాలిఫోర్నియా గవర్నర్ అత్యవసర సేవల కార్యాలయం తెలిపింది.
