జ్యూరిచ్: అంతర్జాతీయ సంగీత వేదికపై తెలుగు సంకీర్తన సాహిత్యానికి అరుదైన గౌరవం దక్కింది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ప్రసిద్ధ కీర్తన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగింది. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన గ్రామీ అవార్డు విజేత గాత్ర సంగీత బృందం ‘చాంటిక్లియర్’, గాయకుడు వినీల్ గరిశ మహల్‌తో కలిసి ఎలాంటి సంగీత వాయిద్యాలు లేకుండా ఈ కీర్తనను అత్యంత మధురంగా ఆలపించింది.
సోల్స్ బర్గ్ఫెస్టివల్లో..
స్విట్జర్లాండ్‌లోని రైన్ఫెల్డెన్లో జరిగిన ‘సోల్స్బర్గ్ ఫెస్టివల్–2026’ వేదికపై ఈ ప్రదర్శన జరిగింది. దాదాపు ఆరు శతాబ్దాల క్రితం (15వ శతాబ్దంలో) అన్నమయ్య రచించిన ఈ సమతా సందేశ కీర్తనను విదేశీ కళాకారులు స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో, అద్భుతమైన గాత్ర సమ్మేళనంతో (హార్మొనీ) పాడటం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ లైవ్ ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. భాషా, దేశ సరిహద్దులను దాటి తెలుగు భక్తి సంగీత వైభవం విశ్వవ్యాప్తం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
