- కుదరదన్న చైర్మన్ రేవూరి.. తుది నిర్ణయం లేకుండానే వాయిదా
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. హౌస్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడిన వీడియో ఫుటేజీ ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టగా, సభ నిబంధనల ప్రకారం అది ఇవ్వడం కుదరదని చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని వాయిదా వేశారు.
శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు వెడ్మ బొజ్జు, వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు, పైడి రాకేశ్ రెడ్డి హాజరయ్యారు. మరో ఇద్దరు సభ్యులు కూనంనేని సాంబశివరావు, మధుసూదన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో కడియం శ్రీహరిని ఉద్దేశించి హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియో ఫుటేజీని ప్రదర్శించారు. సభ్యులు దాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఫుటేజీతోపాటు కడియం శ్రీహరి మాట్లాడిన వీడియో ఫుటేజీని కూడా ఇవ్వాలని పట్టుబట్టారు. దీనిపై చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ.. సభ నిబంధనల ప్రకారం కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఫుటేజీ మాత్రమే ఇవ్వడం సాధ్యమని, కడియం మాట్లాడిన ఫుటేజీ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. కమిటీలో మరో ఇద్దరు సభ్యులు గైర్హాజరు కావడంతో వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో కమిటీ భేటీని తాత్కాలికంగా వాయిదా వేశారు. తదుపరి సమావేశం ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని చైర్మన్ తెలిపారు.
