ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
  •     మంత్రి సీతక్క అధికారులకు ఆదేశం
  •     పోట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, రామప్ప-లక్నవరం కాలువ పనులతో సాగునీటి భరోసా
  •     పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం.. 4,500 మందికి పైగా వైద్య పరీక్షలు

తాడ్వాయి/ములుగు, వెలుగు : ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం మేడారంలోని హరిత హోటల్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే రెండు నెలల పాటు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, రహదారుల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, భవిష్యత్ అవసరాలు, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అనుబంధ జాతరైన ఐలాపురంలో వసతుల కల్పనకు ఐటీడీఏ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

అంతకుముందు వనదేవతలను దర్శించుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు. మరోవైపు ములుగు మండలం ఇంచెర్లలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా రైతులు పంటల మార్పిడి, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు రూ.145 కోట్లతో పోట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.35 కోట్లతో రామప్ప–లక్నవరం అనుసంధాన కాలువ పనులు చేపట్టి సాగునీటి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రామచంద్రపురం, లక్నవరం ప్రజల కోసం కొత్త ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులను, వ్యవసాయ పరికరాల ప్రదర్శన స్టాళ్లను కలెక్టర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రారంభించారు.

ఆ తర్వాత గోవిందరావుపేట మండలంలోని పీఎస్ఆర్ గార్డెన్‌‌‌‌‌‌‌‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్‌‌‌‌‌‌‌‌నాథ్ కేకన్‌‌‌‌‌‌‌‌, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాలతో కలిసి సీతక్క ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కలెక్టర్, ఎస్పీ సుధీర్ రామ్‌‌‌‌‌‌‌‌నాథ్ కేకన్ చొరవతో నిర్వహించిన ఈ శిబిరానికి 4,500 మందికి పైగా ప్రజలు తరలిరావడం అభినందనీయమన్నారు. దాదాపు 100 ఆస్పత్రులకు చెందిన వైద్య నిపుణులు క్యాన్సర్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి లక్షల రూపాయల విలువైన మందులను ఉచితంగా అందించారు. కంటి సమస్యలున్న వారికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో శంకర్ ఐ హాస్పిటల్ ద్వారా చికిత్స అందిస్తామని, మెడికవర్ ఆస్పత్రి ద్వారా రూ.1.50 కోట్ల విలువైన 5,000 ఉచిత వైద్య పరీక్షల కూపన్లు అందజేసినట్లు మంత్రి వెల్లడించారు.