మన్సూరాబాద్‌‌‌‌‌‌‌‌ లోని మహిళలను కట్టేసి రూ.3.30 కోట్ల అపహరణ

మన్సూరాబాద్‌‌‌‌‌‌‌‌ లోని మహిళలను కట్టేసి రూ.3.30 కోట్ల అపహరణ
  • ఎల్బీనగర్ మన్సూరాబాద్‌‌‌‌‌‌‌‌లో పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం

ఎల్బీనగర్, వెలుగు: మన్సూరాబాద్‌‌‌‌‌‌‌‌లోని చందేశ్వర్ కాలనీలో శనివారం పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ముసుగులు ధరించిన నలుగురు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి, మహిళలను కట్టేసి రూ.3.30 కోట్ల నగదును దోచుకెళ్లారు. చందేశ్వర్ కాలనీలో సామ మానమ్మ (65), ఆమె కొడుకు ప్రవీణ్ రెడ్డి, కోడలు మౌనిక నివాసం ఉంటున్నారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న మానమ్మ బంధువు సంపత్ కుమార్ రెడ్డి స్థిరాస్తి కొనుగోలు కోసం రూ.3.30 కోట్లను తన బావ విజయ్ కుమార్ రెడ్డికి పంపించారు. 

ఆయన ఇంట్లో పెళ్లి పనులు ఉండడంతో సేఫ్టీ కోసం ఆ నగదును మానమ్మ ఇంట్లో భద్రపరిచారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి మానమ్మ, మౌనికల చేతులు కట్టేసి, నోళ్లకు ప్లాస్టర్ వేశారు. వారి ఫోన్లను ధ్వంసం చేసి, బెడ్రూమ్‌‌‌‌‌‌‌‌లోని బీరువా పగులగొట్టి నగదుతో ఉడాయించారు. బాధితుల కేకలతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదుతో ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ వెంకటేశం ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌తో ఆధారాలు సేకరించారు. ఇంట్లో భారీగా నగదున్న విషయం తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.