నాటక పోటీల్లో తమిళనాడు ఫస్ట్.. తెలంగాణ సెకండ్.. ‘మీనాక్షిపురం గ్రామ వేదన’కు తొలి బహుమతి

 నాటక పోటీల్లో తమిళనాడు ఫస్ట్..  తెలంగాణ సెకండ్.. ‘మీనాక్షిపురం గ్రామ వేదన’కు తొలి బహుమతి
  • ‘డిజిటల్ వల’ నాటికతో తెలంగాణకు రెండో స్థానం 
  • దక్షిణ భారత స్థాయి సమ్మిళిత నాటక పోటీలు షురూ

హైదరాబాద్, వెలుగు: దక్షిణ భారత స్థాయి జాతీయ సమ్మిళిత నాటక పోటీల్లో తెలంగాణ బృందం రెండో బహుమతి గెలుచుకుంది. తమిళనాడు బృందం మొదటి బహుమతి దక్కించుకోగా, పుదుచ్చేరి బృందం మూడో బహుమతి సొంతం చేసుకుంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని దాశరథి కళాక్షేత్రంలో ఈ పోటీలు జరిగాయి. తమిళనాడు బృందం ‘మీనాక్షిపురం గ్రామ వేదన’ నాటికతో ఫస్ట్ ప్రైజ్ సాధించింది. 

తెలంగాణ బృందం ‘డిజిటల్ వల’ నాటికతో సెకండ్ ప్రైజ్, పుదుచ్చేరి బృందం ‘రామాయణ ప్రదర్శన ద్వారా తమిళ సంస్కృతి పంచభూతాల వేడుకలు’ నాటికతో థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నాయి. ఏపీ బృందం ‘వీర నారి గున్నమ్మ’, కర్ణాటక బృందం ‘మాయల పెట్టె’ నాటికలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఐదు రాష్ట్రాల బృందాలు తమ ప్రదర్శనలతో అలరించాయి. ఈ పోటీలను ప్రారంభించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ఎన్నో రంగాల్లో ప్రత్యేక ప్రతిభ ఉంటుందని చెప్పారు. 

ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా సమ్మిళిత విద్య అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను తెలియజేస్తున్నామని అన్నారు. జాతీయ విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీ కుమారి ఇరా సింఘాల్ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఇతర పిల్లలకు ఏమాత్రం తీసిపోకుండా ఆకాశమే హద్దుగా ఎదగగలరని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులు తమలోని నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇలాంటి నాటక పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ పోటీలకు జాతీయ విద్యాశాఖ డైరెక్టర్ పి. శ్రీకళ, నాటక రంగ నిపుణులు కన్నయ్యలాల్ కైత్వాస్, ఒగ్గు రవి జడ్జీలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అదనపు ఎస్పీడీ పి.వి. శ్రీహరి, జాయింట్ డైరెక్టర్లు ఉషారాణి, పి. మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.