- సంక్షేమ పథకాలను హక్కుగా వినియోగించుకోవాలి
- ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ముషీరాబాద్, వెలుగు: బ్రాహ్మణ సమాజం సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలంటే అన్ని సంఘాలు ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్’ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. ఈబీసీ సర్టిఫికెట్ల ద్వారా విద్య, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సంకోచించకుండా పొందాలన్నారు. అర్హులంతా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బ్రాహ్మణ మహిళలు వ్యాపార, స్వయం ఉపాధి రంగాల్లో రాణించడం అభినందనీయమని, సంఘాల సమస్యలను చట్టపరిధిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
దేవాలయాలకు రక్షణ కరువైంది: రామచంద్రరావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తమిళనాడు ప్రభుత్వం హిందువుల విశ్వాసాలను దెబ్బతీస్తోందన్నారు. మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. బ్రాహ్మణులపై జరిగే దుష్ప్రచారాలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
దేశవ్యాప్తంగా ఉన్న పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.25 వేల కోట్లు కేటాయించాలని ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. మంగపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జాతీయ అధ్యక్షుడు పండిట్ ఎస్.శర్మ, రవికుమార్, సూర్యకాంతం పాల్గొన్నారు.
