చెన్నై: కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించింది. శనివారం ఉదయం జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏప్రిల్‌లో తాము వ్యతిరేకించిన రెండు ప్రధాన డిమాండ్లను కేంద్రం కొత్త బిల్లులో రాతపూర్వకంగా చేర్చిందని డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ తెలిపారు.
ఇది 2024 నుంచి తమ పార్టీ చేస్తున్న పోరాటానికి, దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ దక్కిన విజయమని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. 1971 జనాభా ఆధారంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు పునరాలోచించాలని సూచించారు. డీలిమిటేషన్‌కు 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే మద్దతు ఇవ్వడంతో పార్లమెంటులో బిల్లును సులభంగా పాస్ చేసుకునేందుకు కేంద్రానికి బలం చేకూరింది.
59కి పెరగనున్న సీట్లు
కొత్త బిల్లు ప్రకారం.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% సీట్లు పెరగనున్నాయి. దీంతో లోక్‌సభలో తమిళనాడుకున్న 7.2% వాటాకు ఎలాంటి నష్టం కలగదు. పైగా.. రాష్ట్రంలోని లోక్‌సభ సీట్ల సంఖ్య ప్రస్తుత 39 నుంచి 59కి పెరుగుతుండటంతో డీఎంకే ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. పార్లమెంటు సీట్లను పెంచడం తమ ఉద్దేశం కాదని.. కానీ కేంద్రం సీట్లు పెంచితే తమ రాష్ట్ర వాటా తగ్గకుండా చూడటమే తమ ప్రధాన డిమాండ్ అని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
