న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో దేశ ప్రజాస్వామ్యానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని ఇండియా కూటమి నిర్ణయించింది. లోక్‌సభ స్థానాలను 850కి పెంచడం ద్వారా బీజేపీ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని చూస్తున్నదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ ప్రక్రియతో లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం దక్కాల్సిన ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్‌కు కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన బాధ్యతలు అప్పగించడం మరిన్ని అక్రమాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పార్లమెంటులో ఈ బిల్లును ఉమ్మడిగా వ్యతిరేకించాలని తీర్మానించారు.
అధికారాన్ని శాశ్వతం చేసుకునే యత్నం
రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం జరిగిన ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశంలో బిల్లుకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 400 సీట్ల నినాదంతో ముందుకొచ్చిన బీజేపీ ప్రజల మద్దతు పొందలేకపోయిందని, ఇప్పుడు లోక్‌సభ స్థానాలను 800 దాటించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నదని విమర్శించారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లోనే దేశాధికారాన్ని శాశ్వతంగా ఉంచుకోవాలన్నది ఎన్డీయే ప్రభుత్వ ఆలోచనగా ఉందని ఆరోపించారు. చైనాలో మాదిరిగా అందరూ ఒకేసారి చేతులెత్తి ఆమోదం తెలిపే పరిస్థితిని తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలని ప్రధాని మోదీ చూస్తున్నారని మండిపడ్డారు. అధికారం దక్కితే రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని అమలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అసోం, జమ్మూకాశ్మీర్‌లో తమకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేశారని గుర్తుచేశారు.
ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యానికి దెబ్బ
రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వుడ్ స్థానాల సంఖ్య కూడా పెరగాల్సి ఉన్నా.. ప్రతిపాదిత బిల్లులో దీనిపై స్పష్టత లేదని ఖర్గే తప్పుబట్టారు. జనాభా పెరిగినా తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం ఈ వర్గాలకు అన్యాయం చేయడమేనన్నారు. 2026 జనాభా లెక్కలను పునర్విభజనలో ఎలా పరిగణనలోకి తీసుకుంటారో ప్రభుత్వం వివరించడం లేదని విమర్శించారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని, మహిళా రిజర్వేషన్లను కూడా ప్రస్తుత స్థానాల ఆధారంగానే అమలు చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది.
ఈసీకి బాధ్యతలివ్వడంపై..
ఓటర్ల జాబితాల నుంచి 10 కోట్ల మంది పేర్లు తొలగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ చేపట్టడాన్ని ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్ల చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్‌కు ఇంత కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే పారదర్శకత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బీజేపీకి అనుకూలంగా జనరల్ స్థానాలను రిజర్వుడ్‌గా, రిజర్వుడ్ స్థానాలను జనరల్‌గా మార్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
