జమ్మూ: ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లరని, అవసరమైతే కాంగ్రెస్ నేతలే మూటాముల్లె సర్దుకుని వెళ్లాల్సిన సమయం వచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రజాతీర్పుతోనే మోదీకి ఈ పదవి దక్కింది తప్ప, ఎవరి వారసత్వంతోనో రాలేదని స్పష్టంచేశారు. శనివారం జమ్మూలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో, అరాజకతా హఠావో’ పాదయాత్ర అనంతరం ఆయన మాట్లాడారు.
మోదీని ప్రధానిని చేసిన ప్రజలకు మాత్రమే ఆ పదవిని వెనక్కి తీసుకునే అధికారం ఉందని తేల్చిచెప్పారు. ‘‘నేనొక ఫకీర్‌ను, ప్రజలు ఎప్పుడు వెళ్లిపొమ్మంటే అప్పుడు నా సంచి సర్దుకుని వెళ్లిపోతాను’’ అని మోదీ అనేకసార్లు చెప్పారని గుర్తుచేశారు. పదవిపై ఆయనకు ఎలాంటి వ్యామోహం లేదన్నారు. అలాంటి వ్యక్తిపై నిరాధార ఆరోపణలు చేస్తూ గద్దె దించేందుకు ప్రతిపక్షాలు దేశంలో అరాచకం సృష్టిస్తున్నాయని రాజ్‌నాథ్ మండిపడ్డారు.
