ఇండ్లు ఖాళీ.. సైనిక స్థావరాల్లోకి అమెరికా మంత్రులు

ఇండ్లు ఖాళీ.. సైనిక స్థావరాల్లోకి అమెరికా మంత్రులు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలోని సుమారు అరడజను మంది కీలక మంత్రులు, ఉన్నతాధికారులు తమ ప్రైవేట్ నివాసాలను ఖాళీ చేసి, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సైనిక స్థావరాలకు మారారు. ముఖ్యంగా ఇరాన్ నుంచి పొంచి ఉన్న ప్రాణహాని ముప్పుతో పాటు దేశీయంగా పెరుగుతున్న రాజకీయ హింస నేపథ్యంలో భద్రతా సంస్థల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్, అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్‌‌‌‌ ఇటీవల మిలిటరీ బేస్‌‌‌‌లకు మారిన వారిలో ఉన్నారు. వీరికంటే ముందే విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ తమ కుటుంబాలతో సహా వాషింగ్టన్ పరిసరాల్లోని సైనిక స్థావరాల్లోకి మారారు. 

ఇరాన్‌‌‌‌పై కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో తనకు, ఇతర కేబినెట్ సహచరులకు ఇరాన్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ బెదిరింపులకు భయపడేదిలేదని, ఇరాన్‌‌‌‌పై ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మిలిటరీ క్వార్టర్ల కేటాయింపుపై కాంగ్రెస్‌‌‌‌లో చర్చ  

విదేశీ ముప్పుతో పాటు అంతర్గత భద్రతా సమస్యలు కూడా అధికారుల నివాస మార్పుకు కారణమయ్యాయి. స్టీఫెన్ మిల్లర్ ఇంటి ఎదుట ఆందోళనలు జరగడం, ఆయన ఇంటి చిరునామాను బహిర్గతం చేస్తూ కరపత్రాలు పంచడంతో కుటుంబ భద్రత దృష్ట్యా ఆయన సైనిక స్థావరానికి మారాల్సి వచ్చింది. సాధారణంగా అమెరికాలో అధికారులు సాధారణ ప్రజల మధ్య నివసిస్తుంటారు. ఇలా పెద్ద సంఖ్యలో మంత్రులు సైనిక స్థావరాల్లోకి మారడం అరుదైన పరిణామమని ఎక్స్‌‌‌‌పర్ట్స్ పేర్కొంటున్నారు.