జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌లోని ఏపీ ఎంపీ సీఎం రమేశ్ నివాసంలో రూ.18 లక్షల నగదు చోరీకి గురైంది. ఇంట్లో సహాయకుడిగా (హౌస్‌హోల్డ్ అసిస్టెంట్) పనిచేస్తున్న వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ఎంపీ సీఎం రమేశ్ నివాసంలో కొద్ది రోజుల క్రితం రూ.18 లక్షలు మాయమయ్యాయి. అప్పటి నుంచి ఇంట్లో పనిచేస్తున్న దేశ్‌ముఖ్ ప్రవీణ్ కుమార్ విధులకు హాజరు కాకుండా అదృశ్యమయ్యాడు.
అతడిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో ప్రవీణ్ కుమారే ఆ నగదును దొంగిలించి పరారై ఉంటాడని అనుమానిస్తూ ఎంపీ కార్యదర్శి ఎం.అనిల్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
