పద్మారావు నగర్, వెలుగు: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మార్గంలో 4 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ శనివారం తెలిపారు. రైలు నంబర్ 07119 చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు 2027 జనవరి 10, 17 తేదీల్లో సాయంత్రం 4:20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07120 శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి ప్రత్యేక రైలు 2027 జనవరి 11, 18 తేదీల్లో మధ్యాహ్నం 2:00 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
