న్యూఢిల్లీ: తమ నాణ్యతపై ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ) చర్యలు తీసుకోవడంపై ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ బిస్లెరీ శనివారం స్పందించింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి ప్లాంట్ నుంచి సేకరించిన నీటి శాంపిల్‌లో ‘కోలిఫామ్ బ్యాక్టీరియా’ ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతించిన విషయం తెలిసిందే.
అదే బ్యాచ్ (పీబీ201) నీటిని రెండు గుర్తింపు పొందిన ఇండిపెండెంట్ ల్యాబ్‌లలో పరీక్షించామని, పూర్తి నాణ్యతతో ఉన్నట్లు తేలిందని బిస్లెరీ పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 12న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాల మేరకు ఆ బ్యాచ్ బాటిళ్లను వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నామని కంపెనీ తెలిపింది.
ప్రభుత్వ, స్వతంత్ర ల్యాబ్ ఫలితాల్లో తేడా రావడానికి కారణాలు, శాంపిల్ సేకరణ, పరీక్షా విధానాలను సమీక్షించాలని కోరింది. ఇటీవల గోవా ప్లాంట్ శాంపిల్ విషయంలోనూ బిస్లెరీపై చర్యలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతించింది. రెండు ల్యాబ్స్ ఫలితాల్లో తేడాలపై విచారణ జరిపించాలని బిస్లెరీ కోరింది.
