- దక్షిణాదికి నష్టం లేకుండా దామాషాలో 50% సీట్ల పెంపుపై కేంద్రం కసరత్తు
- బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు
- జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ సంస్కరణలతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. డీలిమిటేషన్‌తో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పూలే చిత్రపటానికి నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, మహిళల చదువు కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా మహిళలకు చదువుతో పాటు రాజ్యాధికారం దక్కాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీ చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తున్నారని తెలిపారు.
దక్షిణాదికి అన్యాయం జరగదు
డీలిమిటేషన్‌తో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రస్తుత సీట్ల సంఖ్యను దామాషా ప్రకారం 50 శాతం పెంచే ఆలోచనతో కేంద్రం ముందుకెళ్తోందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 170కిపైగా, పార్లమెంట్ సీట్లు17 నుంచి 25 వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. 1971లో దేశ జనాభా 56 కోట్లు ఉన్నప్పుడు 543 ఎంపీ సీట్లు ఉండేవని, నేడు జనాభా 140- కోట్ల నుంచి 145 కోట్లకు చేరినందున సీట్ల పెంపు అనివార్యమని వెల్లడించారు. 2021లో జనగణన జరగనందున 2011 లెక్కల ఆధారంగా సీట్లు పెంచితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గాల మధ్య ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందని రాంచందర్ రావు చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 40 లక్షల ఓట్లు ఉంటే, సికింద్రాబాద్‌లో 11 లక్షల ఓట్లే ఉన్నాయని, అలాగే శేరిలింగంపల్లి అసెంబ్లీలో 7.5 లక్షల ఓట్లు ఉంటే, అంబర్‌పేటలో 2.5 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అసమానతలను సరిచేసి ఓటర్ల సంఖ్యను సమానంగా విభజించేందుకే డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతున్నామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌ది కుట్రపూరిత వైఖరి
గతంలో రాజీవ్ గాంధీ మహిళా రిజర్వేషన్ల పేరుతో హడావుడి చేశారే తప్ప అమలు చేయలేదని, యూపీఏ హయాంలోనూ వారి మిత్రపక్షాలే బిల్లును అడ్డుకున్నాయని రాంచందర్‌రావు ఆరోపించారు. నేడు కాంగ్రెస్ బయటకు మద్దతు ఇస్తున్నట్లు నటిస్తూనే, లోపల డీలిమిటేషన్, రిజర్వేషన్ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తోందని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
