సతారా: డీలిమిటేషన్ బిల్లుకు ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలన్న శరద్ పవార్ నిర్ణయంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. పార్టీని, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన ప్రధాని మోదీ, అమిత్ షా కాళ్ల మీద పడటం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని విమర్శించారు. శనివారం మహారాష్ట్రలోని సతారాలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మహారాష్ట్ర భవిష్యత్తుకు దురదృష్టకరమన్నారు.
ఇకపై ఆ పార్టీ ఫూలే, షాహు, అంబేద్కర్, యశ్వంతరావు చవాన్ పేర్లు ఎత్తే హక్కు కూడా కోల్పోతుందని వ్యాఖ్యానించారు. ఎంవీఏలో కాంగ్రెస్, శివసేన సహకారంతోనే ఎన్సీపీకి చెందిన 8 మంది ఎంపీలు గెలిచారని గుర్తు చేశారు. మోదీ, షాల వైఖరిని వ్యతిరేకించి జైలుకు వెళ్లిన అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లకు పవార్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ నెల 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
