హైదరాబాద్ సిటీ, వెలుగు: నగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉస్మాన్‌సాగర్ (గండిపేట) నుంచి అదనంగా 21 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు జలమండలి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా షేక్‌పేట్ ఫిల్టర్ బెడ్స్‌లో 21 ఎంజీడీల సామర్థ్యంతో నూతన నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత 120 అడుగుల రహదారి నిర్మాణం, భారీ తాగునీటి పైపులైన్ల ఏర్పాటుపై శనివారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, హెచ్‌జీసీఎల్ ఎండీ ఉపేందర్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఎంజీఐటీ నుంచి పుప్పాలగూడ బీఆర్సీ వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించి పైపులైన్ల అలైన్మెంట్, నిర్మాణపరమైన అడ్డంకులు, భూసేకరణ, అనుమతుల అంశాలను పరిశీలించారు. 1200 ఎంఎం, 1300 ఎంఎం రెండు భారీ పైపులైన్ల ఏర్పాటుకు, మొత్తం పది కిలోమీటర్ల మేర పనులకు సమగ్ర డిజైన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
