హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇస్తోందో, దీని వెనుక కుదిరిన ఒప్పందం ఏమిటో స్పష్టం చేయాలని విప్ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బీజేపీకి ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయనడానికి ఈ మద్దతే నిదర్శనమని, వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం బయటపడిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శనివారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, కేసీఆర్ మధ్య హాట్‌లైన్ నడుస్తోందని, రానున్న రోజుల్లో కలిసి పనిచేయడానికి కొత్త ఎత్తుగడ వేశారని అద్దంకి దయాకర్ విమర్శించారు.
రోజూ పరస్పరం విమర్శించుకునే ఈ రెండు పార్టీల నాయకులు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ఉత్తరాది రాష్ట్రాల బలంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నా బీఆర్ఎస్ ఏకపక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం సరికాదని, దక్షిణాది అస్తిత్వం గురించి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని దయాకర్ మండిపడ్డారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కానప్పటికీ బీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇస్తోందో తెలంగాణ ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ పతనం ఇప్పటికే ప్రారంభమైందని, అందుకే డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తెచ్చారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ‘బేస్‌లెస్ రాష్ట్ర సమితి’గా మారుతోందని ఎద్దేవా చేస్తూ, ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు.
