వరంగల్ సిటీ, వెలుగు: వ్యక్తిత్వ వికాసం, సాంస్కృతిక, సామాజిక విలువల ద్వారానే బలమైన జాతి నిర్మాణం సాధ్యమవుతుందని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయ 24వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన గ్రాడ్యుయేట్లు, పీహెచ్డీ స్కాలర్లు, గోల్డ్ మెడలిస్టులకు అభినందనలు తెలిపారు. విద్యార్థి దశలోనే జీవిత విలువలు, అలవాట్లు, భవిష్యత్ దిశ నిర్ణయమవుతాయని, ‘నేషన్ ఫస్ట్’ అనే భావనతో నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, మనం ధరించే దుస్తులు కాకుండా వ్యక్తిత్వమే మనిషికి అసలైన గుర్తింపునిస్తుందని స్వామి వివేకానంద సూక్తులను గుర్తు చేశారు. అనంతరం 400 మంది విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు.
