- నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్‌లో ముగ్గురు అరెస్ట్
- రూ.1.75 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఈగల్ ఫోర్స్ అందించిన సమాచారంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయ్యింది. నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1.75 కోట్ల విలువైన కిలో470 గ్రాముల మాదకద్రవ్యాలను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా కార్యకలాపాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్ వరకు విస్తరించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సింథటిక్ డ్రగ్స్ సహా ఇతర మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న ఈగల్ ఫోర్స్.. కస్టమర్లు, సప్లయర్ల డేటా ఆధారంగా అంతర్రాష్ట్ర ముఠాల వివరాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పట్టుబడిన ముఠాలు ఇచ్చిన సమాచారంతో నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈగల్ ఫోర్స్ అందించిన సమాచారంలో నాగ్‌పూర్ పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 10 గంటల పాటు సోదాలు నిర్వహించారు. నాగ్‌పూర్‌లోని సక్కర్దారా, మహల్ ప్రాంతాలతో పాటు మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో తనిఖీలు చేపట్టారు. మధ్యప్రదేశ్ దసరా రోడ్డులోని సానే గురూజీ ఉద్యాన్ సమీపంలో దాచిన డ్రగ్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పదార్థాల్లో 820 గ్రాముల మెఫెడ్రోన్, 650 గ్రాముల క్రిస్టలిన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో నాగ్‌పూర్‌కు చెందిన షేక్ రఫీక్, అబ్దుల్ అరీప్ అలియాస్ చింటూ, ప్రతీక్ చంద్రకాంత్ కదమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జితు, రాజస్థాన్‌కు చెందిన సంజయ్ విశ్వకర్మ అలియాస్ అక్కీభాయ్ నుంచి డ్రగ్స్ సేకరించినట్లు గుర్తించారు. డ్రగ్స్‌తో పాటు రూ.లక్ష నగదు, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
