హైదరాబాద్, వెలుగు: చట్టసభల్లో బీసీలకు న్యాయమైన వాటా దక్కేలా ప్రత్యేక రిజర్వేషన్ చట్టం తీసుకురావాలని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ కోరారు. ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న తరహాలో బీసీలకు కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా నెక్లస్ రోడ్‌లోని ఆయన విగ్రహానికి బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ బీసీల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌తోపాటు మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకొస్తున్న నేపథ్యంలో బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు చట్టసభల్లోనూ అదే విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు.
అధికారంలో ఉన్నవారు బీసీల ఆకాంక్షలను పట్టించుకోకుండా ఉండొద్దని, వారికి తగిన గౌరవం కల్పించాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి వారి వాటా వారికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లు అవుతుందని నిరంజన్ అన్నారు.
