50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాదికి రక్షణ : పొంగులేటి సుధాకర్ రెడ్డి 

50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాదికి రక్షణ : పొంగులేటి సుధాకర్ రెడ్డి 

 

  •     పునర్విభజన, మహిళా రిజర్వేషన్లతో ప్రజాస్వామ్యంలో నవశకం
  •     పొంగులేటి సుధాకర్ రెడ్డి 


హైదరాబాద్, వెలుగు: నియోజకవర్గాల పునర్విభజనతో పాటు పార్లమెంట, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి స్వాగతించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మహిళలకు రాజకీయ సాధికారత కల్పించాలన్న ప్రధాని మోదీ దార్శనికత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయాత్మక నాయకత్వానికి ఈ సంస్కరణలు నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పునర్విభజన అనేది కేవలం చట్టసభల్లో సీట్ల పెంపు ప్రక్రియ మాత్రమే కాదని, మారుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించి, ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేసే చారిత్రాత్మక సంస్కరణ అని అభివర్ణించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ స్థానాలను సమాన నిష్పత్తిలో 50 శాతం పెంచాలన్న ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.